Husband Brutally Murdered his Wife in Uppal : భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు హత్యలకు దారితీయడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారిపోయింది. కట్టుకున్న భార్య అని చూడకుండా ఆమెను హత్య చేసి భర్త పరారైన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రదీప్ బోలా, మధుస్మిత దంపతులు గత కొంత కాలంగా ఉప్పల్‌లో నివాసం ఉంటున్నారు. భార్యభర్తలిద్దరి మధ్య మొదలైన చిన్న వివాదం పెరిగి పెద్దదైంది. ఈ నేపథ్యంలో విచక్షణ కోల్పొయిన భర్త కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉప్పల్‌లోని న్యూ భరత్‌నగర్ కాలనీలోని ఓ ఇంట్లో ఓ గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు 100కు డయల్ చేసి చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి చూశారు. కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఈ గదిలో ఒడిశా రాష్ట్రం అయబ, కెండ్రపరకు చెందిన దంపతులు ప్రదీప్ బోలా, మధు స్మిత (28) కిరాయికి ఉంటున్నారు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కోపంతో భర్త భార్యను హత్యచేసి సంచిలో పెట్టి పరారయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.