Public Grievance at TDP Central Office : టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికకు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. వివిధ సమస్యలతో వచ్చిన వారి నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీమంత్రి పీతల సుజాత తదితరులు వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. కొందరి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరం అవుతుండటంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
'నాపై కక్షగట్టారు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అండతో తప్పుడు కేసులు' - PUBLIC GRIEVANCE AT TDP OFFICE
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధితులు - వినతులు స్వీకరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీమంత్రి పీతల సుజాత తదితరులు

Public Grievance at TDP Central Office (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2024, 10:55 PM IST
బాధితులు వెల్లడించిన ఫిర్యాదులు ఈ విధంగా ఉన్నాయి..
ప్రజావేదికకు ఫిర్యాదుల వెల్లువ - సత్వర పరిష్కారంతో బాధితుల ముఖాల్లో వెలుగులు (ETV Bharat)
- తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నానని తనపై కక్షగట్టారని మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అండతో పోలీసులు తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలానికి చెందిన న్యాయవాది చంద్రయ్య వాపోయారు. తనపై పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించాలని ఎమ్మెల్యే అక్రమాలకు సహకరిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
- తన స్థలాన్ని ఆక్రమించిన వైఎస్సార్సీపీ నేతలు అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇదేంటని ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని విజయవాడకు చెందిన దాసరి కుమారి వాపోయారు.
- ఎస్సీల విద్యోన్నతికి 2014-19 మధ్య అమలైన పలు సంక్షేమ పథకాల్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, కూటమి ప్రభుత్వం వీటిని తిరిగి పునరుద్ధరించాలని దళిత హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ జోగారావు కోరారు.
- కన్నకొడుకు, కోడలు తనను ఇంట్లో నుంచి వెళ్లగొడితే రహదారి మీద బతుకుతున్నానని, ఈ నేపథ్యంలో తన దగ్గరున్న మూడు లక్షల్ని ఇద్దరు మహిళలు కాజేశారని చిలకలూరిపేటకు చెందిన కోటేశ్వరమ్మ వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
- ప్రకాశం జిల్లాలో సుమారు 25 వేల మంది ఆశావహులు నాలుగేళ్లుగా డీఎస్సీ కోసం నిరీక్షిస్తుండగా జిల్లాలో కేవలం 80 పోస్టుల్నే ఖాళీలుగా చూపిస్తున్నారని కొండపల్లి శ్రీనివాస్ వద్ద పలువురు నిరుద్యోగులు వాపోయారు.
- గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న తమకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డేటా ఏంట్రీ ఆపరేటర్లుగా వినతిపత్రం సమర్పించారు.
- ఇటీవల కృష్ణా నదికి వచ్చిన భారీ వరదల్లో తమ పడవలు, వలలు కొట్టుకుపోవడంతో జీవనాధారం కోల్పొయామని, తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం, ఆముదాల్లంకకు చెందిన మత్స్యకారులు కోరారు.
- తండ్రి నుంచి సంక్రమించిన భూమిని సాగుచేసుకోనివ్వకుండా వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకుంటున్నారని కడప జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గం భూడుగుంటపల్లికి చెందిన మురళి, బాబురావు ఫిర్యాదు చేశారు.