How To Cast Vote Using EVM :ఓటు అమూల్యం ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. మన దేశం, మన రాష్ట్రం, మన సమాజం, వ్యక్తిగత జీవితాలు బాగుపడాలన్నా, భవిష్యత్తు ఉజ్వలంగా మారాలన్నా మనం వేసే ఓటే కీలకం. ప్రస్తుతం మన రాష్ట్ర భవితను నిర్దేశించే అత్యంత కీలక ఎన్నికలు జరుగుతున్నవి. ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఓటు కీలకమే. ఓటు వేసేటప్పుడు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉండొద్దు. సందేహాలు పెట్టుకోవొద్దు. తొలుత ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో చూసుకోవటం మొదలుకుని ఓటు వేసేంత వరకూ ఎలాంటి విధానం ఉంటుంది, ఓటు ఎలా వేయాలి? మీరు వేసిన ఓటు సరిగ్గానే పడిందా? లేదా? నిర్ధారించుకోవటమెలా? తదితర అంశాలపై సమాచారం..
ఓటును సక్రమంగా వినియోగించుకుందాం - సరిగ్గా పడిందా? లేదా? ఇలా నిర్ధారించుకుందాం (ETV Bharat) ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటుందో ముందే చూసుకోండి :
మొదటి దశ: మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది, ఓటరు జాబితాలో మీ సీరియల్ నంబరు సంఖ్య వంటివన్నీ ముందే ఒకటి, రెండు సార్లు సరిచూసుకోండి. మీ ఇంటి వద్దకే ఎన్నికల సంఘం సిబ్బంది వచ్చి ఓటరు చీటీలు పంపిణీ చేస్తారు. వాటిపై మీ పేరు, పోలింగ్ కేంద్రం, ఓటరు జాబితాలో మీ సీరియల్ నంబరు తదితర వివరాలన్నీ ఉంటాయి. ఒకవేళ ఆ చీటి మీకు అందకపోయినా సరే ఓటరు హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఆ వివరాలు పొందొచ్చు.
ఓటరు చీటీ, గుర్తింపు కార్డు పట్టుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి : -
రెండో దశ:ఓటరు చీటి, గుర్తింపు కార్డు పట్టుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ తొలుత పోలింగ్ అధికారి-1 ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేదా? పరిశీలిస్తారు. మీ గుర్తింపు కార్డు చూస్తారు. అనంతరం మీ పేరు, ఓటరు జాబితాలో మీ సీరియల్ నంబర్ చదివి వినిపిస్తారు. పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున ఉండే పోలింగ్ ఏజెంట్లు ఓటరు పేరు, సీరియల్ నంబర్‌ను వారి వద్ద ఉన్న ఓటరు జాబితాలో సరిచూసుకుని టిక్కు మార్క్ పెట్టుకుంటారు.
ఎడమ చేతి వేలిపై సిరా చేతికి చీటీ : -
మూడో దశ: పోలింగ్ అధికారి- 2 వద్దకు వెళ్లాలి. ఆ అధికారి మీ ఎడమ చేతి వేలిపై సిరా గుర్తు వేస్తారు. తన వద్దనున్న రిజిస్టర్‌లో మీ పేరు, వివరాలు సరిచూసుకుని సంతకం తీసుకుంటారు. నిరక్షరాస్యులైతే వేలిముద్ర వేయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఓ చీటీ అందిస్తారు.
ఓటు వేయటానికి అనుమతిస్తారు : -
నాలుగో దశ:పోలింగ్ అధికారి-3 వద్దకు వెళ్లి ఆ చీటీ అందించాలి. ఆ అధికారి వేలిపై ఉన్న సిరా గుర్తు తనిఖీ చేస్తారు. ఆ తర్వాత ఓటు వేయటానికి ఆయన మీకు అనుమతిస్తారు. అప్పుడు ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాలి. బ్యాలట్ యూనిట్ (ఈవీఎం)పై ఉన్న బల్బు వెలుగుతూ ఉంటుంది.
ఎర్ర రంగు లైటు వెలిగి.. బీప్ శబ్దమొస్తే మీ ఓటు పోలైనట్టు : -
అయిదో దశ:బ్యాలట్ యూనిట్‌లో వరుసగా అభ్యర్థి పేర్లు, వారికి కేటాయించిన గుర్తులు ఉంటాయి. వాటి ఎదురుగా నీలి రంగు బటన్ ఉంటుంది. మీరు ఏ అభ్యర్థికైతే ఓటు వేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థి పేరు, గుర్తుకు ఎదురుగా ఉన్న నీలి రంగు బటన్‌పై నొక్కాలి. అప్పుడు ఆ గుర్తు పక్కనే వలయాకారంలో ఉండే ఎర్ర రంగు లైటు వెలుగుతుంది. ఆ తర్వాత బీప్‌మని శబ్దం వస్తుంది. పక్కనే ఉన్న వీవీ ప్యాట్ యంత్రంలో మీరు ఏ అభ్యర్థికైతే ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమసంఖ్య, పేరు, గుర్తుతో కూడిన ఓ చీటీ 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. ఆ తర్వాత వీవీ ప్యాట్ డబ్బాలో కింద పడిపోతుంది. అది చూసుకుని మీ ఓటు సరిగ్గా పోలైందా? లేదా? అనేది అక్కడే నిర్ధారించుకోవచ్చు.
తొలిసారి ఓటు వేస్తున్నారా? ఈవీఎంలో ఓటు ఎలా పడుతుందో తెలుసుకోండి! - How To Cast Vote Using EVM
లోక్‌సభకు ఒక ఓటు.. శాసనసభకు మరో ఓటు :ప్రస్తుతం రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క ఓటరు మొదట లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న వారికి (ఎంపీ ఎన్నిక కోసం) ఒక ఓటు, తర్వాత శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న వారికి (ఎమ్మెల్యే ఎన్నిక కోసం) మరో ఓటు వేయాల్సి ఉంటుంది. పైన నిర్దేశించిన ప్రక్రియలో ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాలి.
బీప్ శబ్దం రాకపోయినా పెట్టెల్లో చీటీ కనిపించకపోయినా ఫిర్యాదు చేయండి :మీరు ఓటు వేసిన తర్వాత బీప్ శబ్దం రాకపోయినా, వీవీ ప్యాట్ పెట్టెల్లో చీటీ కనిపించకపోయినా వెంటనే అక్కడ ఉండే ప్రిసైడింగ్ అధికారిని కలిసి ఫిర్యాదు చేయాలి.
ఈ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉంటే చాలు : -
ఓటరు జాబితాలో మీ పేరు ఉండి ఫోటో ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) కార్డు మీ వద్ద లేకపోయినా ఫర్వాలేదు. ఈ కింది జాబితాలోని గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్కటి తీసుకెళ్లినా సరే ఓటు వేయటానికి అనుమతిస్తారు.
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- ఉపాధి హామీ జాబ్ కార్డు
- డ్రైవింగ్ లైసెన్సు
- పాస్‌పోర్టు
- యునిక్ డిజెబిలిటీ ఐడీ (యూడీఐడీ) కార్డు
- ఫొటోతో కూడిన సర్వీసు ఐడెంటిటీ కార్డు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వ లిమిటెడ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు)
- బ్యాంకు/పోస్టాఫీసు పాస్ పుస్తకం (వాటిపై ఫొటో ఉండాలి)
- కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు
- ఎన్‌పీఆర్‌లో భాగంగా ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు
- ఫొటోతో కూడిన ఉద్యోగి పింఛన్ డాక్యుమెంట్
- ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించిన అధికారిక గుర్తింపు కార్డు
రాష్ట్రవ్యాప్తంగా 46,389 కేంద్రాలు, 4.14 కోట్ల ఓటర్లు - ప్రశాంత పోలింగ్‌పై ఈసీ నజర్ - AP ELECTIONS 2024