Medchal-Malkajgiri Theft Case :తనఇంటి దగ్గర దొంగతనం చేస్తే అమెరికాలో ఉన్న ఆ ఇంటి యజమాని సీసీటీవీలో చూసి పక్కింట్లో ఉండే బంధువులను అలర్ట్ చేశాడు. దీంతో ఆ ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు దొంగల్లో ఇద్దరిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు దుండగులు పరారయ్యారు. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా పరిధిలోని కాచవాని సింగారం ముత్వెల్లిగూడలో డ్రీమ్స్ హోమ్స్ కాలనీలో గుర్తు తెలియని నలుగురు దొంగలుపడ్డారు. అర్ధరాత్రి ఆ ఇంటి తాళం పగులకొట్టారు. ఈ దృశ్యాలు అన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అమెరికాలో ఉంటున్న ఆ ఇంటి యజమాని సీసీటీవీలో చూసి పక్కనే ఉన్న వారి బంధువులను అలర్ట్ చేశారు. వెంటనే అతడు స్థానిక కాలనీ వాసులతో కలిసి చోరీ జరుగుతున్న ఇంటివైపు వెళ్లారు. ఇది గమనించిన దొంగలు పారిపోవడానికి ప్రయత్నించారు.