ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ జైలును తనిఖీ చేసిన మంత్రి అనిత - ఫ్రిజ్, టీవీలు ఎందుకు కొన్నారని ప్రశ్న - VIJAYAWADA SUB JAIL ALLEGATIONS

విజయవాడ జిల్లా జైలు అధికారులను హెచ్చరించిన హోం మంత్రి అనిత - కారాగారం ఆకస్మిక తనిఖీ

Anitha Inspects Vijayawada Sub Jail
Anitha Inspects Vijayawada Sub Jail (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2024, 12:37 PM IST

Vijayawada Sub Jail Allegations : 'గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సమయంలో కొత్త టీవీలు, ఫ్రిజ్ ఎందుకు కొన్నారు? ఆ సమయంలో ఏం జరిగింది? నిజం చెప్పండి. ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేశారు? ఎప్పుడూ లేనిది ఆ సమయంలోనే ఎందుకు హడావుడిగా కొని, జైలుకు తరలించారు?’ అని హోం మంత్రి వంగలపూడి అనిత జిల్లా కారాగారం అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. అవినీతిపరులకు కొమ్ముకాసి మీ ఉద్యోగానికి ఎసరు తెచ్చుకోవద్దని ఆమె హెచ్చరించారు.

విజయవాడలోని జిల్లా జైలును హోం మంత్రి అనిత సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీల బ్యారక్‌లకు వెళ్లి వారితో మాట్లాడారు. ఆహారం, వసతులు, ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అనంతరం జైలు సూపరింటెండెంట్‌ పాల్, జైలర్లు వేణు, గణేష్, డిప్యూటీ జైలర్‌ నాయక్‌తో ఆమె మాట్లాడారు. గనుల శాఖలో అక్రమాలకు సంబంధించి ఏసీబీ అరెస్ట్ చేసిన ఆ శాఖ మాజీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 నుంచి నవంబర్ 16 వరకు రిమాండ్‌ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు. ఆ సమయంలో ఫ్రిజ్, టీవీలను కొని, జైల్లో పెట్టడంపై ఆరోపణలు వినిపించాయి.

Anitha Inspects Vijayawada Sub Jail : కారాగారంలో ఇన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఏముందని అనిత జైలు అధికారులను ప్రశ్నించారు. ఇన్సులిన్, ఇతర మందులు భద్రపర్చుకునేందుకు ఒక ఫ్రిజ్‌ కావాలని అక్టోబర్ 4న జైలు వైద్యుడు రాతపూర్వకంగా అడిగారని, అయితే తాను దానిపై సంతకం పెట్టలేదని పర్యవేక్షకుడు మంత్రికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ‘నేను ఆ నెల 7 నుంచి 15 వరకు వ్యక్తిగత పనులపై సెలవులో ఉన్నా. 7న ఫ్రిజ్‌ కావాలని మళ్లీ రాసినట్లు చెప్పారు. 10న జైలుకు కొత్త ఫ్రిజ్‌ వచ్చింది. దానిని డాక్టర్‌ గదిలో ఉంచారు. 16న నేను రౌండ్స్‌లో ఉండగా టీవీ కావాలని వెంకటరెడ్డి అడిగారు. రెండు బ్యారక్‌లలో టీవీలు పని చేయడం లేదు. డీఐజీ ఆదేశాల మేరకు అక్టోబర్ 25న రెండు టీవీల కోసం ఇండెంట్‌ పంపించాం. తర్వాత కొద్ది రోజులకే టీవీలు కారాగారానికి చేరాయి’ అని మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది.

మూడు రోజుల్లో దర్యాప్తు పూర్తిచేస్తాం :తనిఖీల అనంతరం జైలు బయట మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. విజయవాడ జైలులో వెంకటరెడ్డి రిమాండ్‌ ఖైదీగా ఉన్న సమయంలో కొన్ని వస్తువులు కారాగారంలోకి వెళ్లాయన్న ఆరోపణలపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఫ్రిజ్‌, టీవీలు కావాలని ముందే ఇండెంట్‌ పెట్టారా లేక అప్పటికప్పుడు పెట్టారా అన్నదానిపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. వైద్యాధికారిపైనా విచారణ చేస్తున్నామని తెలిపారు. దర్యాప్తు మూడు రోజుల్లో పూర్తవుతుందని బాధ్యులని తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని అనిత వ్యాఖ్యానించారు.

మరోవైపు రూ.6000 కోట్ల విలువ చేసే పోర్టును కేవలం రూ.594 కోట్లకే వైఎస్సార్సీపీ నాయకులు కొట్టేసిన విషయం ప్రజల్లోకి వెళ్లిందని అనిత పేర్కొన్నారు. దీంతో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలు చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కాకినాడ పోర్టులో తనిఖీకి వెళ్లడానికి వారం ముందే ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ వ్యక్తిగత పనులపై సెలవులో వెళ్లారని, అందువల్లే ఆయన రాలేదని అనిత వెల్లడించారు.

"వాట్ ఈజ్ దిస్ వెంకట్​రెడ్డీ?" కోటి కూడా లేని కంపెనీకి 160కోట్ల కాంట్రాక్ట్ - కటింగ్ పేరిట కోట్లు కొట్టేసే స్కెచ్!

విజయసాయిరెడ్డిపై కేసులు తప్పవు - ఎవరెవరిని బెదిరించారో తెలుసు : హోంమంత్రి అనిత

ABOUT THE AUTHOR

...view details