Home Minister Anitha on Rape Incident: శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై అత్యాచారం జరిగిన ఘటనలో 48 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు నిందితులకు వేగంగా శిక్ష పడాలని కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా కోరుతున్నామన్నారు. వారి ఇళ్ల వద్ద, వ్యాపార వాణిజ్యం సముదాయాల వద్ద పెట్టుకున్న సీసీ కెమెరాలను పోలీసు శాఖకు అనుసంధానం చేస్తే నేర నియంత్రణ సాధ్యం అవుతుందని తెలిపారు. పోలీసులకు ఆయుధాల్లాగే, ప్రజలకు మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని, వాటిని వినియోగించి నేర నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం - పోలీసుల అదుపులో నిందితులు
సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అందుకే సత్యసాయి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనలో అత్యంత వేగంగా విచారణ కోసం కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగించామన్నారు. దొరికిన ఐదుగురు నిందితుల్లో ఒకరిపై అత్యాచార ఆరోపణలు సహా 37 కేసులు ఉన్నాయని హోంమంత్రి చెప్పారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.
నేరాలు జరగకుండా ముందే మేలుకోవాలి: నేరాలు తగ్గించడమే తమ ప్రాధాన్యమని అన్నారు. నేరాలు ఎక్కడ జరిగినా ముందే మేలుకోవాలని సూచించారు. ప్రజలంతా సీసీ కెమెరాలు విరివిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. కెమెరాలు లేనిచోట డ్రోన్స్ వినియోగించాలన్నారు. డ్రోన్స్ లేకపోతే మొబైల్ ఫోన్లు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా వీడియో తీస్తున్నారని, ఇలాంటి వార్తలు మాకు ఇచ్చేట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. నేరాలు జరగకుండా ముందే మేలుకోవాలని, ఒకవేళ నేరం జరిగినట్లయితే నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
ఎట్టిపరిస్థితుల్లో నేరం చేసినవాడు తప్పించుకోకూడదన్న హోంమంత్రి, మహిళల భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇలాంటి కేసుల్లో జాప్యం లేకుండా స్పెషల్ కోర్టులు ఏర్పాటుచేస్తున్నామని, మహిళల భద్రత విషయంలో చిన్న ఘటన జరిగినా సీఎం నేరుగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఘటనపై సీఎం వెంటనే ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారని అన్నారు. నేరం చేయాలన్న ఆలోచనకు కూడా భయపడాలని హెచ్చరించారు.
సత్యసాయి జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం సీరియస్