HMDA Shiva Balakrishna Case Update : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా కార్యదర్శి శివబాలకృష్ణ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ(ACB) అధికారులు గుర్తించారు. ఆయన ఎనిమిది రోజుల ఏసీబీ కస్టడీ నేటితో పూర్తి కావడంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం శివబాలకృష్ణను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఆయన జ్యుడీషియల్ రిమాండ్(Judicial Remand) రేపటితో ముగియనుంది. అలాగే ఈ కేసులో కీలక విషయాలను గుర్తించినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుదీంద్ర తెలిపారు.
ఈ కేసులో బాలకృష్ణ, ఆయన బినామీల పేరు మీద 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుదీంద్ర తెలిపారు. అత్యధికంగా జనగామలో 102 ఎకరాల భూమి ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆయన పేరు మీద 29 ప్లాట్లు ఉండగా అందులో ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నట్లు బయటపడిందన్నారు. ఒక విల్లాతో పాటు 7 ఇళ్లు ఉండగా బహిరంగ మార్కెట్లో ఆ ఆస్తుల విలువ రూ.250 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపారు.
ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ - 15 బ్యాంకు ఖాతాల లవాదేవీలపై అధికారుల ఆరా
Ex HMDA Director Shiva Balakrishna Case :హెచ్ఎండీఏ కార్యాలయాల్లో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో కీలకమైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుదీంద్ర వివరించారు. విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు శివబాలకృష్ణ సరైన సమాధానాలు చెప్పలేదన్నారు. మరోసారి ఆయనను కస్టడీలోకి తీసుకోవాలా లేదా అని న్యాయ సలహాతో ముందుకు వెళ్తామన్నారు.