Hindu JAC About Tirumala laddu Issue :దేవాలయాల్లో అన్యమతస్థుల్ని తొలగించాలని, భవిష్యత్‌లోనూ పాలకమండళ్లలో హిందూయేతరుల్ని నియమిస్తే ఊరుకునేది లేదని హిందూ జేఏసీ హెచ్చరించింది. తిరుమల పవిత్రత సంరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై విజయవాడలో పుణ్య స్వామీజీలు, మాతాజీలు సమావేశం నిర్వహించారు. తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరా కారకులందరినీ వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
తిరుమలలో పెద్ద గోశాల ఏర్పాటు చేసి టీటీడీకి అవసరమైన ఉత్పత్తులను అక్కడి నుంచే సేకరించాలని సూచించారు. త్వరలో స్వామీజీలంతా సీఎంను కలసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. పవన్ తరహాలోనే ప్రజాప్రతినిధులంతా హిందూ మనోభావాల పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
'ఐదు సంవత్సరాలుగా రథాలు తగలబడ్డాయి. పిఠాపురంలో పాతిక గుడులపై దాడులు చేశారు. ఆరు దేవాలయాల్లో అర్చకులను వైఎస్సార్సీపీ నేతలు గర్బగుడుల్లోకి దూరి కొట్టారు. ఆ రోజు వాటిని నిలువరించలేకపోయాం, అధికారం అండతో పేట్రేగిపోయిన వారిని ఆనాడు ఆపలేకపోయాం. ఈ రోజు మాకు అవకాశం వచ్చింది బుద్ధిగా మసులుకోండి. అది రాజకీయ పునరావాస కేంద్రం కాదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే తిరుమల ప్రక్షాళన కోసం అడుగులు వేయడం హర్షనీయం.'-కమలానంద భారతీ స్వామీజీ, భువనేశ్వరి పీఠం