High Tension Wires Falls on Students: తెగి కిందపడి ఉన్నహైటెన్షన్ విద్యుత్ తీగలు తాకటంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం కనిగిరి పట్టణానికి చెందిన నజీర్, గౌతమ్, బాలాజీ అనే ముగ్గురు విద్యార్థులు విజేత జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. రోజు మాదిరిగానే ఇంటి వద్ద నుంచి కాలేజ్‌కు అని బయలుదేరిన విద్యార్థులు కళాశాలకు వెళ్లకుండా కనిగిరి సమీపంలోని పునుగోడు చెరువును చూసేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు.
ఆ సమయంలో పునుగోడు ఎస్సీ కాలనీలో హైటెన్షన్ తీగలు కిందపడి ఉండటాన్ని గమనించని విద్యార్థులు ప్రమాదవశాత్తూ విద్యుత్తీగలను తాకారు. ఈ విద్యుదాఘాతంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ప్రమాదంలో మంటలు చెలరేగి వారి మృతదేహాలు కాలిపోయాయి. ఈ విద్యుదాఘాతంలో బైక్ సైతం దగ్ధమైపోయింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విద్యుత్ అధికారులను పిలిపించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
భార్యపై అనుమానం- నోట్లో కరెంట్ వైర్ పెట్టి హత్య చేసిన భర్త
ఈ ఘటనలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఉదయమే తెగి పడిన విద్యుత్ తీగలను గుర్తించిన స్థానికులు విద్యుత్ అధికారులకు తెలిపినప్పటికీ తీగలను సరిచేయకుండా నిర్లక్ష్యంగా అలాగే వదిలేసారు. ఫలితంగా ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను విద్యుత్ అధికారులే బలి తీసుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మృతులు ముగ్గురు పేద కుటుంబాలకు చెందినవారు. మృతుల్లో ఒకరైన గౌతం అనే విద్యార్థి తల్లిదండ్రులు తాపీ పనులు చేసుకుంటూ కుమారుడిని చదివిస్తున్నారు.
మరొక మృతుడు బాలాజీ లారీ క్లీనర్‌గా పనిచేస్తూ చదువుకుంటున్నట్లు సమాచారం. ఈ ఘటనలో మూడో మృతుడైన నజీర్‌ను తల్లిదండ్రులు కూలీనాలీ చేసుకుంటూ చదివిస్తున్నారు. విద్యార్థుల మృతితో కనిగిరి పట్టణంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి ఉంటే ఇంతటి దారుణం జరిగేది కాదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని బాధితకుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఘటనపై మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి:ఈ ఘటనపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో యువకులు చనిపోవడం తనను కలిచివేసిందని పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం చెల్లిస్తామని, అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
నోట్లో ఎముకలు, బిర్యానీ కుక్కి కరెంట్ షాక్- పవిత్ర కళ్లముందే దర్శన్ చిత్రహింసలు