High Court on Neha Reddy Illegal Construction at Bhimili Beach :విశాఖ జిల్లా భీమిలి బీచ్‌లో సీఆర్‌జెడ్ (CRZ -coastal Regulation Zone) జోన్ నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. రాజకీయ జోక్యంతో కూల్చివేత చర్యలను ఆపవద్దని జీవీఎంసీ (GVMC)కి సూచించింది. నిర్మాణాల కూల్చివేతలపై స్టే ఉత్తర్వులు లేవని మీ పనిని మీరు చేయాలని తెలిపింది.
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రపు నీటికి అతి సమీపంలో సీఆర్‌జడ్ (కోస్టల్ రెగ్యులేషన్ జోన్) నిబంధనలను ఉల్లంఘించి విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డి కాంక్రీట్ ప్రహరీ నిర్మించడాన్ని సవాలు చేస్తూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై హైకోర్టు బుధవారం మరోసారి విచారణ జరిపింది. నేహారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సీఆర్‌జడ్-2 పరిధిలో మాత్రమే నిర్మాణాలు చేశామని, సీఆర్‌జడ్ 1 పరిధిలో కాదని చెప్పారు. ధర్మాసనం సూచించిన నేపథ్యంలో ఇప్పటికే కూల్చివేతకు అయిన ఖర్చు చెల్లించాలని అధికారులు తమను కోరుతున్నట్లు తెలిపారు. రాజకీయ కక్షతో పిల్ దాఖలు చేశారన్నారు.
ధర్మాసనం స్పందిస్తూ‘కోర్టు ముందున్న ఫొటోలను పరిశీలిస్తే సీఆర్‌జడ్-2 పరిధిలోకి వచ్చే ప్రాంతంలో నిర్మాణాలు చేస్తున్నట్లు కనిపించట్లేదు. సముద్రానికి అతి సమీపంలో ప్రహరీ నిర్మించారు. నిర్మాణాల అనుమతులు, ఇతర అంశాలను సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యంలో తేల్చుకోవాలి’ అని సూచించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్. ప్రణతి వాదనలు వినిపిస్తూ మొత్తం విస్తీర్ణం విషయంలో వివరణ కోరుతూ నేహారెడ్డికి తాజాగా షోకాజ్ నోటీసు ఇచ్చామని, దానిపై ఆమె స్పందించలేదని అందుకే స్థాయీనివేదికను కోర్టు ముందు ఉంచడంలో జాప్యం జరుగుతోందన్నారు. మరికొంత సమయం కావాలని కోరారు.