AP HC on Sajjala Bail Petition : తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో దర్యాప్తునకు సహకరించాలని వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆయన అరెస్ట్ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమార్తి జస్టిస్ వీ.ఆర్.కే కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఘటన రోజున పిటిషనర్ పోరుమామిళ్లలో ఘటనా స్థలానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని న్యాయస్థానానికి నివేదించారు. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పీపీ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. దాడి ఘటన రోజు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉన్నట్లు ఇద్దరు సహ నిందితులు, మరో ఇద్దరు సాక్షులు వాగ్మూలం ఇచ్చారని ధర్మాసనానికి వివరించారు.