High Court hearing on Game Changer movie special shows :గేమ్‌ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలపై తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. గొర్ల భరత్ రాజ్ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. జనవరి 10వ తేదిన ఉదయం 4.30 గంటలకు సినిమా ప్రదర్శనకు అనుమతివ్వడపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ధరలు పెంచకుండా ఆదేశించండి : టికెట్ ధరల పెంపు కూడా నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ పెంపుపై ఉత్తర్వులివ్వకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. హైకోర్టు స్పందిస్తూ తరచూ ఇలాంటి మెమోలు ఎందుకిస్తున్నారని ప్రశ్నించింది. తదుపరి విచారణను రేపటికి (జనవరి 10) వాయిదా వేసింది.
బెనిఫిట్ షోలకు నిరాకరణ : దిల్ రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే అర్థరాత్రి 1 గంట బెనిఫిట్ షోలకు మాత్రం ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. జనవరి 10న వేకువజామున 4 గంటల నుంచి 6 షోలకు అనుమతించింది.