HC dismissed Nimmagadda Prasad Quash Petition: జగన్ అక్రమాస్తుల కేసు నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వాన్ పిక్ ఛార్జిషీట్ నిందితుల నుంచి నిమ్మగడ్డ ప్రసాద్‌ను తొలగించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. నిమ్మగడ్డ ప్రసాద్ వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిక్ కె.లక్ష్మణ్ తీర్పు వెల్లడించారు. కేసు నుంచి తొలగించాలని కోరుతూ సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ వేసుకోవడానికి అనుమతినిచ్చింది. నిమ్మగడ్డ డిశ్చార్జి పిటిషన్ వేస్తే ఈ తీర్పును పరిగణనలోకి తీసుకోకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు తెలిపింది.
గుంటూరు, ప్రకాశం జిల్లాలో వాన్ పిక్ ప్రాజెక్టు పేరిట వైఎస్ సర్కారు సుమారు 13వేల ఎకరాల భూములను కేటాయించింది. వాన్ పిక్ ప్రాజెక్టు ముసుగులో నిమ్మగడ్డ ప్రసాద్ సుమారు 1426 కోట్ల రూపాయల విలువైన భూములను కేవలం 165 కోట్ల రూపాయలకే దక్కించుకున్నారని సీబీఐ అభియోగం. ప్రతిఫలంగా జగన్‌కు నిమ్మగడ్డ ప్రసాద్ 854 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఛార్జిషీట్లో దర్యాప్తు సంస్థ వెల్లడించింది. నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు ఛార్జిషీట్లోని నిందితులపై సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది.
అయితే తన పేరు తొలగించాలంటూ నిమ్మగడ్డ ప్రసాద్ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాన్ పిక్ కుట్రలో నిమ్మగడ్డ ప్రసాద్‌దే కీలక పాత్ర అని సీబీఐ వాదించింది. సుమారు 280 మంది సాక్షుల వాంగ్మూలాలు, వెయ్యికి పైగా డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతే సీబీఐ కోర్టు అభియోగాలను స్వీకరించిందని వివరించింది. నిమ్మగడ్డ ప్రసాద్ సుమారు 900 ఎకరాలను ఇతరులకు అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని సీబీఐ తెలిపింది. ముడుపులను జగన్ కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించినందుకే వాన్ పిక్ ప్రాజెక్టును, రాయితీలను కల్పించారని వాదించింది.