Heavy Traffic on Vijayawada Hyderabad National Highway Post Sankranti :సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లి తిరిగి వస్తున్న వారితో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. కొర్లపహాడ్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ నెలకొంది. వాహనదారులు ఇబ్బంది పడకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు.
రెండు రోజుల్లో 95 వేల వాహనాలు :సంక్రాంతి పండుగకు తమ సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులు, ఉద్యోగులు అందరూ తిరిగి హైదరాబాద్ నగరం బాట పట్టారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. బుధవారం, గురువారం రెండు రోజుల్లో 95 వేల వాహనాలు వెళ్లినట్లు అధికారులు చెప్పారు. చిట్యాల, అంకిరెడ్డిపాలెం, చౌటుప్పల్, తుఫ్రాన్ పేట, ఆందోల్ మైసమ్మ టెంపుల్ వద్ద వాహనాల రద్దీ లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నారు.
ట్రాఫిక్, టోల్ ప్లాజా సిబ్బందికి తగు సూచనలు :సొంతూళ్లకు వెళ్లి తిరిగి వస్తున్న వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్, టోల్ ప్లాజా సిబ్బందికి తగు సూచనలు చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు.
ప్రత్యేక చర్యలు చేపట్టాం : హైదరాబాద్‌కు వస్తున్న వాహనాలకు గ్రామాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి సదుపాయాలు కల్పించాలమో తిరిగి వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి అన్నారు. వాహనాలు రద్దీ ఏర్పడే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.