Rains In Telangana : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. షేక్‌పేట, ఫిలింనగర్, గచ్చిబౌలి మార్గంలో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. మెహిదీపట్నం, టోలిచౌకి మార్గంలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
అటు కూకట్‌పల్లి, హైదర్‌నగర్, బాచుపల్లి, మూసాపేట్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, బహదూర్‌పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, బోయిన్‌పల్లి, ప్రగతి నగర్, బేగంపేట, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, బాచుపల్లి, మూసాపేట్‌లోనూ వర్షం పడింది.
నిజామాబాద్‌లో వర్షాలు :మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నిజామాబాద్‌లోని రైల్వే బ్రిడ్జి వద్ద వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. పోలీసులు, స్థానికులు ప్రయాణికులను సురక్షితంగా బయటకు చేర్చారు. మరోవైపు బోధన్, ఆర్మూర్, బీర్కూర్, నవీపేట, ఇందల్వాయి, డిచ్పల్లి, సిరికొండ మండలాల్లో జోరు వాన కురిసింది.