Rain Alert in AP 2024 : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 12 గంటల్లో ఇది క్రమంగా బలహీనపడి ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మధ్య తీరాన్ని దాటుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని చిలక సరస్సుకు దగ్గరగా కేంద్రీకృతమై ఉన్నట్టు పేర్కొంది. గడచిన మూడు గంటలుగా అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతున్నట్టు వెల్లడించింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు : ప్రస్తుతం ఒడిశాలోని పూరికి నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వివరించింది. ఇది వాయువ్యంగా కదులుతూ ఒడిశా-ఛత్తీస్‌గఢ్ భూభాగాలపైకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆ తదుపరి 12 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడనున్నట్టు స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.
AP Weather Updates 2024 :కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ నుంచి విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఉపరితలంపై గాలులు వీస్తాయని తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వానలు కురుస్తాయని పేర్కొంది. చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది.
10 సెంటిమీటర్ల కంటే అధిక వర్షపాతం : మరోవైపు వాయుగుండం కారణంగా రాష్ట్రంలో చాలా చోట్ల 10 సెంటిమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లా చింతూరులో 21 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అనకాపల్లిలో 13, నూజివీడులో 10, పాడేరులో 9, వరరామచంద్రాపూరంలో 9, నర్సీపట్నం 9, అరకు 8, కుక్కునూరు 8, విశాఖ 7, కురుపాం , తెర్లాం, బొండబల్లె, టెక్కలి, కూనవరం, చోడవరం గురుగుబిల్లి 7 సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యింది.