Heavy Rains in Andhra Pradesh :రెండు రోజులుగా వడగాడ్పు ఉక్కపోతతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం మరుసటి రోజుకే మారిపోయింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానంలో కురిసిన భారీ వర్షానికి ఎస్టీపీపీ జూనియర్ కళాశాల ప్రాంగణం నీట మునిగి స్విమ్మింగ్ పూల్‌ని తలపిస్తోంది. ఈ నెల 4న పుదుచ్చేరి పార్లమెంటు ఎన్నికల లెక్కింపు కొరకు కౌంటింగ్ కేంద్రంగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ డిగ్రీ కాలేజ్ చుట్టూ భారీ వర్షం నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురు గాలులకు అనేకచోట్ల చెట్లు నేలకొరిగాయి.
అధ్వానంగా మారిన రహదారులు :అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆకాశం మబ్బులు కమ్ముకుని వాతావరణం చల్లబడింది. రాత్రి కురిసిన వర్షానికి గుంతల రహదారిలో నీరు నిలిచిపోయి మరింత అధ్వానంగా మారాయి. జిల్లా కేంద్రం అమలాపురంతో సహా జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు - AP WEATHER REPORT TODAY