Heavy Rains in AP:రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారులపై ఎటు చూసినా వరద చేరిపోవటంతో రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వర్షానికి మట్టి మిద్దె నానిపోయి కూలిపోవటంతో నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో మద్దమ్మ(50) అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్, హాజీ నగర్ కాలనీల్లోని ప్రధాన రహదారులపై వరద ప్రవహిస్తోంది.
అనంతపురం జిల్లా విడపనకల్లు, కూడేరు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులుఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉదయం నుంచి ఆర్.కొట్టాల, గడేకల్లు, పొలికి, పెంచులపాడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూడేరు మండలం గోటుకూరు పొలాల్లో చీనీ, దానిమ్మ పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు - పిడుగుపాటుకు ఇద్దరు మృతి - Tractor Driver Dead in Thunderstorm
భారీ వర్షాలకు ఉమ్మడి కర్నూలు జిల్లా తడిసి ముద్దయింది. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మంత్రాలయం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం భారీ వర్షాలకు చెరువును తలపిస్తోంది. భారీ వర్షం కారణంగా భక్తుల ఇబ్బందులను గుర్తించిన మంత్రాలయం పీఠాధిపతి సుబుదేందు తీర్థులు మఠంలో అందరికీ ఆశ్రయం కల్పించారు. కోసిగి మండలం దేవరబెట్టకు వెళ్లే రోడ్డు కల్వర్టు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి మండలం అమృతాపురంలో టోపీ మారెమ్మవ్వ ఆలయంలోకి వరద ప్రవేశించింది. ఎడతెరిపి లేని వానకు పత్తికొండ- ఆదోని ప్రధాన రహదారిలో చిన్నహుల్తి సమీపంలోని హంద్రీ వాగు నిండుకుండలా ప్రవహిస్తోంది.
దేవనకొండ మండలంలోని అలారుదిన్నె వద్ద హంద్రీ నది ఉద్ధృతంగా మారింది. హాలహర్వి, ఆలూరు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరద ప్రధాన రహదారిపైకి రావటంతో పత్తికొండ-ఆదోని మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. జూపాడుబంగ్లా మండలంలోని పారుమంచాల సమీపంలో ఇసుకలేరు వాగు పొంగి ప్రధాన రహదారి మీదుగా ప్రవహిస్తోంది. హాలహర్వి మండలం చింతకుంట వద్ద తాత్కాలిక వంతెన కోతకు గురవడంతో ఆంధ్ర-కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. గూళ్యం వద్ద వేదవతి నది ఉగ్రరూపం దాల్చింది. హాలహర్విలో ఊరి వంక ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఎస్సీ కాలనీలోకి నీరు ప్రవేశించింది. హాలహర్వి- నిట్రవటి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాలకు ఏజెన్సీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంచంగిపుట్టు మండలం, లక్ష్మీపురం, బుంగపుట్టు పంచాయతీలకు వెళ్లే మార్గంలో గడ్డ పొంగి ప్రవహిస్తుంది. ధ్రువపత్రాల తనిఖీల కోసం వెళ్తున్న రెవెన్యూ పంచాయతీ అధికారులు, సర్పంచ్‌లు వాగులో దిగి బైక్ మోసుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఇప్పటికైనా వంతెన పూర్తి చేసి కష్టాలను తప్పించాలని స్థానికులు కోరుతున్నారు.
ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తోన్న వర్షాలు- కొట్టుకుపోతున్న పంటలు - Rainfall in AP Today