Heavy Rains Alert Today :హైదరాబాద్‌ను మరోసారి భారీవర్షం కుదిపేసింది. సరిగ్గా స్కూళ్లు, ఆఫీసులు వదిలే సమయానికి వర్షం ఒక్కసారిగా విరుచుకుపడింది. ముందుగా మేడ్చల్‌లో ప్రారంభమైన వర్షం నగరమంతటా విస్తరించింది. సికింద్రాబాద్, మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, అమీర్‌పేట, ఖైరతాబాద్, నారాయణగూడ, కోఠి, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
నాంపల్లిలో భారీ వర్షానికి నాంపల్లి స్టేషన్ రోడ్లో రహదారిపై భారీగా చేరిన నీరు చేరింది. ఫలితంగా షాపులలోకి నీరు చేరడంతో యజమానులు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్ నెక్టర్ గార్డెన్స్ దగ్గర స్వల్ప సమయంలోనే కురిసిన భారీవర్షంతో రోడ్లపై అడుగు మేర నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
రహదారులపై మోకాలు లోతు నీరు :సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు చేరుకునే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు అంతా ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులకు గురయ్యారు. కొన్నిచోట్ల రహదారులపైకి మోకాలు లోతు నీరు రావడంతో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రేపు, ఎల్లుండి సెలవు కావడంతో సొంతూళ్లకు వెళ్లాలని బయలుదేరిన వారు వర్షంలో తడిసి ముద్దయ్యారు. పండుగ షాపింగ్ కోసం బయటకు వచ్చిన వారిని అకస్మాత్తుగా కురిసిన వాన ఇబ్బందులు పెట్టింది.