Many Places Rain in Hyderabad :రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాకతో పలుచోట్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఉదయం నుంచి వాతావరణం పొడిగానే ఉంది. కానీ సాయంత్రం కాగానే ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకొని, భారీ వర్షాలు కురిసాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుసింది. రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, పోచారం, ఘట్‌కేసర్, కూకట్‌పల్లి, చందానగర్, సికింద్రాబాద్, తార్నాక, ఎల్బీనగర్, హయత్ నగర్ సహా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు తడిసిముద్దయ్యారు.
Mayor Gadwal Vijayalakshmi Teleconference with Zonal Commissioners Over Rain : వరంగల్-హైదరాబాద్, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పైకి వరద నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడ్డారు. నాగోల్, మనసురాబాద్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవటంతో విజయవాడ రహదారిపై వాహనదారులు నెమ్మదిగా కదిలారు. దీంతో దారిపొడవున వాహనాలు ఆగిపోయి, రోడ్డంతా రద్దీగా మారింది. నగరంలో కుండపోత వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ ఆదేశించారు.
వరద నీరు నిలిచే ప్రాంతాలు, నాళాల దగ్గర పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. అంతకుముందే కురిసిన జోరు వానలకు అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు, రోడ్లపై ఎక్కడా నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు. ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్ లో తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.