Heavy Rains in Hyderabad Today : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జంటనగరాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రహదారులపైకి వరద చేరడంతో వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. రెడ్ హిల్స్ సమీపంలో ఉన్న రహదారి, అబిడ్స్ నుంచి నాంపల్లి స్టేషన్ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. నాంపల్లి లోని దుకాణాలలో నీరు చేరడంతో నీటిని తొలిగిస్తున్నారు. ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నిలిచి పోవడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు :మలక్‌పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాలా పొంగి నల్గొండ చౌరస్తా నుంచి మలక్‌పేట రైల్వేస్టేషన్ వరకు రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. చాదర్ ఘాట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్బీనగర్, నాగోల్, మనసురాబాద్, వనస్థలిపురం, బియన్‌రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో వానదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇళ్లలోకి వరద నీరు : సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్, పాపయ్యనగర్, సంతోష్‌నగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కుత్బుల్లాపూర్‌లోని వెంకటేశ్వరనగర్, ఇందర్‌సింగ్‌నగర్, వాణినగర్‌లలో ఇళ్లలోకి వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రశాంతినగర్ వద్ద నాలా పొంగి రహదారుల్లోకి వరద ప్రవహిస్తోంది. న్యూబోయిన్‌పల్లి హర్షవర్ధన్ కాలనీలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. చింతల్, శ్రీనివాస్ నగర్ వీధుల్లో వరద రోడ్లను ముంచెత్తింది. జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లో ఇండ్లలోకి వరద నీరు రావడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. తినే ఆహరంలోనూ నీరు చేరి మెుత్తం కలుషితం అయ్యాయని బాధితులు తెలిపారు.
రామ్‌నగర్ రోడ్డుపైకి ఓ మృతదేహం : హైదరాబాద్‌లో రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీస్టేడియం ప్రహరీ గోడ కూలింది. భారీ వరదలకు సనత్‌నగర్‌లో కార్లు కొట్టుకుపోయాయి. పార్శిగుట్ట నుంచి రామానగర్ రోడ్డుపైకి ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. పంజాగుట్ట కాలనీలోని సుక్‌నివాస్ అపార్ట్‌మెంట్ రెయిలింగ్‌పై పిడుగు పడడంతో ఓ కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు సైతం తెగిపడ్డాయి. తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి వరదకు కొట్టుకుపోయాడు.