Heavy Rains In Hyderabad: అల్పపీడనం ప్రభావంతో జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ కూడా ప్రకటించింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్‌నగర్‌లో భారీ వర్షం పడింది. మరోవైపు ట్యాంక్ బండ్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం పడటంతో రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దారు.
సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం జల్లులతో మొదలైన వాన మధ్యాహ్నం దంచి కొట్టింది. జోరు వానతో పట్టణంలోని ప్రధాన రహదారితో పాటు అంతర్గతదారులు జలమయంగా మారాయి. బ్లాక్ రోడ్, ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డు, కూరగాయల మార్కెట్ పరిసరాల్లో వర్షపు నీరు నిలిచిపోగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జహీరాబాద్ పట్టణంతో పాటు సబ్‌డివిజన్‌లోని మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్ మండలాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది.