Heavy Rains In Telangana: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, కాజీపేటలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. రహదారులపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా గార్ల మండల శివారులో గల పాకాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా గార్ల నుంచి రాంపురం, మద్దివంచతో పాటు పలు తండాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పర్వతగిరి మండలం పెద్ద తండాలో వరద నీరు ఇళ్లలోకి చేరి తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దంచికొట్టిన వాన : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. వానల ధాటికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్దకొత్తపల్లి మండలం గండ్రావుపల్లిలో వర్షానికి ఓ పాత ఇల్లు కూలిపోయింది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లేపల్లి వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నారాయణపేట మండలం అభంగాపూర్ వద్ద వాగు పొంగింది. ధన్వాడ మండలం మందిపల్లి, పాతపల్లి, ఎమ్మనోనిపల్లి వద్ద వాగులు పొంగి ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
దామరగిద్ద మండలంలో పలుచోట్ల వరి సహా ఇతర పంటలు నీట మునిగాయి. మద్దూరు-బూనీడు మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వనపర్తి జిల్లా మదనపురం మండలంలో సరళాసాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. అడ్డాకుల మండలం వర్ని వద్ద పెద్దవాగు పొంగి పొర్లుతోంది. జడ్చర్ల మండలంలోని వందపడకల ఆసుపత్రిలోకి భారీగా వర్షం నీరు చేరి రోగులు నానా అవస్థలు పడ్డారు.
ఉమ్మడి ఖమ్మంలో పొంగుతున్న వాగులు, వంకలు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల, మండలాలను వరుణుడు వదల్లేదు. మధిర నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు నదులు పొంగిపొర్లుతున్నాయి. మధిర- విజయవాడ, మధిర - ఖమ్మం మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతకాని మండలం పాతర్లపాడు వద్ద వరద నీరు రోడ్డుపైకి చేరడంతో బోనకల్ ఖమ్మం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
ఎర్రుపాలెం మండలం నర్సింహాపురం గ్రామం సమీపంలో వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని మోకు సహాయంతో స్థానిక ప్రజలు కాపాడారు. మధిర మండలం మాటూరు విద్యానగర్ కాలనీలో ప్రధాన విద్యుత్తు లైన్ వైరు తెగి ఇల్లు మీద పడటంతో స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు శివారు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.