Heavy Rain Effect In Bhadradri Kothagudem:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాచలంలోని రామాలయం పడమర మెట్లవద్దకు వర్షపు నీరు చేరింది. ఆ ప్రాంతంలో సుమారు 35 దుకాణాలకు వరద చేరడంతో సామగ్రి మొత్తం వర్షపు నీటిలో తడిసిపోయింది.
హరినాధ బాబా ఆలయం వద్ద కుంగిన కల్యాణ మండపం:భద్రాచలంలోని హరినాధబాబా ఆలయం వద్ద కొండపై కల్యాణమండపం కుంగిపోయింది. మండపం కింద కొండను తవ్వడం వల్ల కుంగిపోయినట్లు సమాచారం. భారీ వర్షాల వల్ల కల్యాణ మండపం కిందకు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 1938లో హరినాధబాబా ఆలయం నిర్మించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై మంత్రి తుమ్మల ఆరా తీశారు.
ఆ ప్రాంతానికి వెళ్లి పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశించారు. దీంతో హరినాధ ఆలయం కల్యాణ మండపాన్ని కలెక్టర్ ఇతర అధికారులు పరిశీలించారు. కొండ కింద ఉన్న ఇళ్లు, దుకాణాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు రామాలయం వద్ద అన్నదాన సత్రంలోకి వర్షపు నీరు చేరింది. దీంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. పడమరమెట్ల వద్ద వర్షపు నీరు వల్ల నిలిచి ప్రయాణాలకు అంతరాయం కలిగింది.