Health Benefits of Foxtail Millet:పిల్లల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఎంతలా ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారికి బలవర్ధకమైన ఆహారం తినిపించాలని తాపత్రయ పడుతుంటారు. కానీ.. ఆ తిండి ఏంటి అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. ఏ ఆహారంలో ఎలాంటి పోషకాలు ఉంటాయి? వేటిని తినిపిస్తే పిల్లలు చక్కగా ఎదుగుతారన్నది తెలియదు. ఈ విషయంలో.. హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్లాంట్ సైన్సెస్ విభాగం రీసెర్చ్ బృందం కీలక సూచనలు చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
కొర్రలు తినిపించాలి..ఐదేళ్ల లోపు పిల్లలకు కొర్రల ఆహారం ఇవ్వాలని, అప్పుడే హెల్దీగా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నవారికి ఇది చక్కటి ఆహారమని అంటున్నారు. యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ముతమిలరసన్ సహా మరో ఆరుగురు పరిశోధకులు చేసిన రీసెర్చ్ సక్సెస్ అయిందని వెల్లడించారు.
ఈ పరిశోధనలో భాగంగా.. వీరు దిల్లీ నుంచి 185 రకం కొర్రలు, ఇక్రిశాట్ నుంచి 155 రకం కొర్రలను తీసుకున్నారు. జీనోమ్ కోడ్ ఎడిటింగ్ ద్వారా.. 185 రకంలో 81 శాతం, 155 రకంలో 70 శాతం ఫైటిక్ యాసిడ్ తగ్గించారు. ఆ తర్వాత నూతన వంగడాలను తయారు చేసి, సాగు చేశారు. ఆ తర్వాత వీటిని ల్యాబ్‌లో పరీక్షించగా.. ఫైటిక్ యాసిడ్ తగ్గినట్టు తేలిందట. ఈ రీసెర్చ్‌ను సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ధ్రువీకరించింది.
తాము పండించిన కొర్ర పంటను పరిశీలిస్తున్న డాక్టర్ ముతమిలరసన్, విద్యార్థులు (ETV Bharat) పిల్లలకు చాలా మంచిది..సాధారణంగా లభించే కొర్రల్లో.. ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు. ఈ ఫైటిక్ యాసిడ్ తగ్గిస్తే.. కొర్రలు తేలికగా జీర్ణమవుతాయని, తద్వారా పోషకాహారలేమి సమస్యను అధిగమించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
మూడేళ్లుగా పరిశోధన..సిరి ధాన్యాలైన సజ్జలు, జొన్నలు, కొర్రలు, రాగుల వల్ల కలిగే ప్రయోజనాలపై ముతమిలరసన్ టీమ్ సుమారు మూడు సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో పోషకాహార లోపంతో అవస్థలు పడుతున్న విద్యార్థులపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక నివేదిక విడుదల చేసింది. 2023లో ఇది రిలీజ్ అయ్యింది. దీని ప్రకారం.. భారత దేశంలో ఐదేళ్ల వయసు లోపు చిన్నారులు.. ఏకంగా 5.32 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని పేర్కొంది. ఈ నివేదికను చూసిన తర్వాతనే.. డాక్టర్ ముతమిలరసన్ టీమ్ ఈ పరిశోధన చేపట్టింది.
వారంలో మూడు రోజులు..ఈ పరిశోధక బృందం సిద్ధం చేసిన కొర్రలను.. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉప్మా, జావ రూపంలో ఇవ్వాలని, వారంలో మూడురోజులు మాత్రమే ఇవ్వాలని, అది కూడా ఒక్క పూట చొప్పునే ఇవ్వాలని సూచించారు. ఇలా 6 నెలలపాటు తినిపిస్తే.. పిల్లల్లో పోషకాహార లోపం తగ్గి.. చక్కగా ఎదుగుతారని నిపుణులు తెలిపారు. మరి, ఈ కొర్రలు మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయంటే.. సుమారు రెండేళ్ల సమయం పట్టొచ్చని చెబుతున్నారు. ఈ కొత్త కొర్రలను సాగు చేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ అనుమతి రాగానే సాగు మొదలవుతుందని, 2 సంవత్సరాల్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
షుగర్, అధిక బరువుతో బాధపడుతున్నారా? - రాగులు ఇలా తింటే ఎంతో మేలట!
అందం, ఆరోగ్యం కోసం - రాగులు తినడమే కాదు ఇలా తాగేయండి!