HM and Teacher Suspended on Teacher Death Case: అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయుడు ఏజాష్ అహ్మద్ (42) అనుమానాస్పద మృతి ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గత 2 రోజులుగా అధికారులు విచారణ చేపట్టారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఘటనపై నిజాన్ని దాచిపెట్టారనే అభియోగంపై ప్రధానోపాధ్యాయుడు షబ్బీర్ని, తరగతి గదికి వెళ్లకుండా విద్యార్థుల ఘర్షణకు కారకుడైన మరో ఉపాధ్యాయుడు వెంకట్రామిరెడ్డిని బాధ్యుడిని చేస్తూ విచారణ కమిటీ నివేదిక సమర్పించింది. దీంతో ఇద్దరినీ సస్పెండ్ చేసినట్టు డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు.
విద్యా సంస్థలలో జరిగే ఎలాంటి విషయాలపైన అయినా యాజమాన్యం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడి భార్య రెహమూన్‌ను మంత్రి నారా లోకేశ్ ఫోన్‌లో పరామర్శించారు. ఆహ్మద్ మృతిపై లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తన భర్త మరణంపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని రెహమూన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొందరు ఉపాధ్యాయులు ప్రేరేపించడంతోనే విద్యార్థులు దాడి చేశారనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొంటామని మంత్రి లోకేశ్ రెహమూన్కు భరోసా ఇచ్చారు.