తెలంగాణ

telangana

పేరేమో ఉత్తమ్ కుమార్ – మాట తీరేమో మూసీ ప్రవాహం : కేసీఆర్‌పై విమర్శలకు హరీశ్‌రావు కౌంటర్ - Harish rao slams Minister Uttam

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 9:23 PM IST

Harish rao slams Minister Uttam Kumar : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ను డెకాయిట్ అంటూ నీటిపారుదలశాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రిని అలా సంభోదించడం, మంత్రి ఉత్తమ్ దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.

Harish rao Fires on Minister Uttam Comments
Harish rao slams Minister Uttam Kumar (ETV Bharat)

Harish rao Fires on Minister Uttam Comments :వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టిన కేసీఆర్‌ను డెకాయిట్ అని అనడానికి మంత్రి ఉత్తమ్‌ కుమార్​ రెడ్డికి నోరెలా వచ్చిందని మాజీమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఇంతకంటే దారుణం, మహాపాపం మరొకటి ఉండదని ఆక్షేపించారు. బూతులు మాట్లాడడంలో, అన్ పార్లమెంటరీ భాష ఉపయోగించడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కంటే అతనేమీ వెనకబడలేదని నిరూపించాలనుకున్నారా? అని ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ప్రశ్నించారు.

డెకాయిటీ చేసింది ఎవరు : పేరేమో ఉత్తమ్ కుమార్ – మాట తీరేమో మూసీ ప్రవాహమని ఎద్దేవా చేస్తూ హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. రేవంత్‌రెడ్డి నోటితో పాటూ ఉత్తమ్ నోటిని కూడా ప్రక్షాళన చేయాల్సి ఉందని ఆయన మండిపడ్డారు. జలయజ్ఞంలో ఈపీసీ పద్ధతిని ప్రవేశపెట్టి ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టుల ఆంచనా విలువలను పెంచేసి, ఏజెన్సీలకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు, నిబంధనలకు విరుద్దంగా సర్వే, డిజైన్ అడ్వాన్స్‌లను 0.5 శాతం నుంచి 3.5 శాతానికి పెంచుకొని రాష్ట్రాన్ని డెకాయిటీ చేసింది ఎవరని అడిగారు.

తట్టమట్టి ఎత్తలేదు : వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నదెవరన్నది మీరు కాదా? అని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.17 వేల కోట్ల నుంచి తట్ట మట్టి ఎత్తకుండానే 40 వేల కోట్లకు పెంచుకున్న సంగతిని మరచిపోయారా అని నిలదీశారు. కాంగ్రెస్ డెకాయటీ గురించి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలో వ్యవసాయ రంగం అభివృద్ధి, ఇతర మానవాభివృద్ధి సూచికల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌ది అని హరీశ్‌రావు తెలిపారు.

ఆహార పంటల ఉత్పత్తి, పంటల విస్తీర్ణాన్ని సాధించడంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టింది కేసీఆర్, ఆయన ప్రవేశపెట్టిన రైతు అనుకూల వ్యవసాయ విధానాలు కావా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్‌ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితం కండ్ల ముందు సాక్షాత్కరించిందని, తెలంగాణ వ్యవసాయానికి ఊపిరిలూదిన ఈ ప్రాజెక్టు నాశనం కాలేని, దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణను ఆగ్రభాగాన నిలిపిందని వివరించారు.

కాంగ్రెస్ వదిలి పెట్టిపోయిన అనేక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాల కల్పనలో అద్భుతమైన ప్రగతి సాధించినందు వల్లే వృద్ధి రేటు సాధ్యమైందని పేర్కొన్నారు.

విద్యార్థులు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదా? : హరీశ్‌రావు - HARISH RAO SLAMS CM REVANTH REDDY

"కాంగ్రెస్​ పాలనలో కర్షకులకు కష్టాలు - పంటలు పండించడం, విక్రయం కత్తిమీద సామే" - Harish Rao Letter to CM Revanth

ABOUT THE AUTHOR

...view details