Harish Rao On TSRTC Merging in Govt :టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందని లేఖలో పేర్కొన్నారు.
ఆర్టీసీ విలీన బిల్లు(TSRTC Merger Bill)ను కొన్ని వివరణలు కోరుతూ గవర్నర్ తమిళిసై తొలుత ఆమోదించలేదని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో ఆమోదం తెలిపిన విషయాన్ని లేఖలో హరీశ్‌రావు గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అప్పట్లో అపాయింటెడ్ డేను ప్రకటించలేకపోయామని అన్నారు. కొత్త ప్రభుత్వం ఈ బిల్లును అమలు చేసే రోజును ప్రకటించాలని కోరారు.
Harish Rao letter to CM Revanth :కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఆర్టీసీ విలీనం ఊసెత్తలేదని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం(Women Free Bus) ప్రారంభించిన రోజే విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు భావించారని అన్నారు. కానీ మహిళలకు ఉచిత బస్ సర్వీసులు ప్రారంభించిన తర్వాత కండక్టర్లు, డ్రైవర్లకు పని భారం పెరిగిందని తెలిపారు. సిబ్బందిపై పని భారం కూడా పెద్ద మొత్తంలో పెరిగిందని లేఖలో హరీశ్‌రావు వెల్లడించారు.
మహిళలకు ఉచిత పథకం ఎఫెక్ట్ మాములుగా లేదుగా- 11 రోజుల్లో రికార్డు స్థాయిలో ప్రయాణాలు