National Para Swimming Championship Competitions :ఆడుతూ, పాడుతూ కళాశాలకు వెళ్తున్న ఆ యువకుడిపై విధి చిన్నచూపు చూసింది. రైలు ప్రమాద రూపంలో రెండు కాళ్లను దూరం చేసి మంచానికే పరిమితం చేసింది. మనోబలం ముందు అంగవైకల్యం ఎంతంటూ గమ్యం వైపు అడుగులేశాడు ఆ యువకుడు. చుట్టుపక్కల వాళ్లు వైకల్యాన్ని ఎత్తి చూపినా, నిరాశ చెందకుండా తనకు ఇష్టమైన ఈతపై దృష్టి సారించాడు. అతి తక్కువ సమయంలోనే చేతులతో ఈత కొట్టేలా ప్రావీణ్యం సంపాదించాడు. రాష్ట్ర స్థాయి పారా స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించి ఔరా అనిపిస్తున్నాడు.
డిజిటల్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ కొలువు :రెండు కాళ్లు లేకపోయినా, చేతులతోనే ఈత కొడుతున్న ఈయన పేరు దేవేందర్. స్వస్థలం గుంటూరు జిల్లా నల్లపాడు. తల్లిదండ్రులు లక్ష్మీ నారాయణ, విజయ లక్ష్మి ఇద్దరూ టైలర్లుగా పని చేస్తూ దేవేందర్‌తో పాటు ఇద్దరు కుమార్తెల్ని కష్టపడి చదివించారు. సరదాగా స్నేహితులతో కలిసి కాలేజ్‌కు వెళ్తున్న దేవేందర్‌ను రైలు ప్రమాదం తలకిందులు చేసింది. అయినా పట్టువిడవకుండా ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం సాధించాడు. 2019లో గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ కొలువు సాధించారు.
పారా ఒలింపిక్స్‌లో పతకం కొట్టడమే లక్ష్యం :తన వైకల్యాన్ని తక్కువగా మాట్లాడే వారికి తన సత్తా చూపాలనే పట్టుదలతో ఇతర అంశాలపై దృష్టి సారించాడు దేవేందర్. నెలల తరబడి సాధన చేస్తే కాని రాని ఈతను రెండు వారాల్లోనే నేర్చుకున్నాడు. ఇటీవల వైజాగ్‌లో జరిగిన పారా రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో తొలిసారి బరిలో నిలిచిన దేవేందర్ అద్భుత ప్రతిభ చూపాడు. మొత్తం మూడు విభాగాల్లో పోటీ పడిన దేవేందర్ రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకాన్ని తనఖాతాలో వేసుకున్నాడు. 50 మీటర్ల ఫ్రీ స్టయిల్ విభాగంలోనూ, 50 మీటర్ల బ్రెస్ట్ స్టయిల్ విభాగంలో అత్యుత్తమ టైమింగ్‌తో పసిడి పతకాలతో సత్తా చాటాడు. అదే విధంగా 100 ఫ్రీ స్టయిల్ విభాగంలో సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. ఈ పోటీల్లో చక్కని ప్రదర్శనతో గోవాలో ఈ నెల 19 నుంచి 22 వరకూ జరిగే 24 నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు అర్హత సాధించాడు. పారా ఒలింపిక్స్‌లో పతకం కొట్టడమే లక్ష్యమని దేవేందర్ అంటున్నారు.