Story on Hand Washing to Reduce Infections : మన అరచేతుల్లో కంటికి కనిపించని క్రిములెన్నో ఉంటాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తూ ఆ చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారం తింటే ఆరోగ్యానికి హానికరమే. హెల్త్ బాగుండాలంటే క్రమం తప్పకుండా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. నేడు చేతుల శుభ్రత దినోత్సవం సందర్భంగా దీనిపై స్పెషల్ స్టోరీ.
మానవ శరీరంలోకి సూక్ష్మక్రిములు ప్రవేశించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎక్కువగా జనం ఉండే ప్రదేశాల్లో పర్యటించినప్పుడు నోరు, ముక్కు ద్వారా క్రిములు లోపలకు వెళ్తాయి. ఎదుటి వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, గట్టిగా మాట్లాడినప్పుడు బ్యాక్టీయాలతో కూడిన శ్వాసకోశ బిందువులు వాయుమార్గంలో శరీరంలోకి చేరుతాయి. చేతులు శుభ్రం చేసుకుంటే శరీరంలోకి కొంత మేర క్రిములు వెళ్లకుండా నియంత్రించొచ్చు.
బాధ్యతగా ఉండాలి : పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లోని శుభ్రత అనేది చాలా ముఖ్యం. పిల్లలకు చేతులు శుభ్రం చేసుకునే విధానాలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. మొదటి నుంచి క్రిములు, వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలి. ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతూ బాధ్యతగా ఉండాలని వివరించాలి.
చేతులు ఎప్పుడు కడుక్కోవాలి ? :ఏమైనా తినే ముందు ఆ తర్వాత కూడా చేతులు కడుక్కోవాలి. మరుగుదొడ్లకు వెళ్లొచ్చినప్పుడు కూడా కచ్చితంగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
దశలు ఇవీ
- కుళాయి నీటితో చేతుల్ని పూర్తిగా తడపాలి.
- తడి చేతులకు తగినంత సబ్బు రాసుకోవాలి.
- సబ్బుతో చేతుల వెనుక భాగంగా, వేళ్ల మధ్యలో, గోళ్ల కింద గట్టిగా రుద్దాలి.
- తర్వాత శుభ్రమైన వస్త్రం లేదా టవల్‌తో తుడుచుకోవాలి.
ఎంతసేపు శుభ్రం చేసుకోవాలి
- కనీసం 20 నుంచి 30 సెకన్ల పాటు చేతుల్ని కడగాలి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.
- ఏదైనా ఇష్టమైన పాట గట్టిగా పాడుతూ చేతులు కడుక్కోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
శుభ్రతపై పాఠ్యాంశాలు : అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యక్తిగత శుభ్రతపై చిన్నప్పటి నుంచే పాఠ్యాంశాలు బోధిస్తున్నారని వ్యక్తిత్వ వికాస నిపుణులు అలజంగి ఉదయకుమార్ తెలిపారు. దేశంలో దాదాపు 70 శాతం పిల్లలకు చేతుల శుభ్రతపై సరైన అవగాహన లేదని అనేక సర్వేలు ప్రకటించినట్లు పేర్కొన్నారు. విద్యాబోధనతోపాటు రోజూ కనీసం ఐదు నిమిషాలైన చేతులు శుభ్రతపై వివరించాలని కోరారు. ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం కంటే ముందుగా ఆరోగ్య జాగ్రత్తల గురించి తెలియజేస్తే పిల్లల్లో మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు.