HAML on nagole to lb nagar link in Second Phase :మెట్రోరైలు రెండోదశలో నాగోల్-ఎల్బీనగర్ మార్గాన్ని కలపడాన్ని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైలు లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్)ప్రాధాన్యంగా భావిస్తోంది. దాదాపు 5 కిలోమీటర్లు దూరంగా ఉండే ఈ మార్గాన్ని పూర్తి చేస్తే నగరంలోని రెండో వలయ(సర్క్యూలర్) మెట్రోకారిడార్ అందుబాటులోకి వస్తుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. తొలి ప్రాధాన్యత పాతబస్తీ అయితే లింక్ కలపడం మలి ప్రాధాన్యతగా అంటున్నారు. ఇప్పటికే మెట్రోరైలు మొదటి దశలో జేబీఎస్ టూ ఎంజీబీఎస్ టూ అమీర్‌పేట మార్గాల్లో ఒక వలయ మెట్రో అందుబాటులో ఉంది. వలయమైనా ఒకటే మెట్రోలో ప్రయాణించలేం.. అందుకు మెట్రోలు మారాల్సి వస్తుంది.
ప్రయోజనాలు ఇవీ
- గమ్యస్థానం చేరేందుకు వలయ మార్గంలోని మెట్రో ట్రైన్ దిగి బస్సులు, క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయించాల్సిన అవసరం తప్పుతుంది. కేవలం మెట్రో మారితే చాలు.
- సమయం వృథా కాకుండా నిర్దిష్ట సమయంలోనే గమ్యస్థానం చేరుకోవచ్చు.
- సాంకేతికత సమస్యలతో ఒకవేళ మార్గమధ్యలో సమస్యలు తలెత్తితే రెండో మార్గాన్ని ఉపయోగించుకోవచ్చు.
- వలయం ఉంటే ఏ మార్గంలో వెళ్లినా గమ్యస్థానం చేరుకోవచ్చు. అయితే గమ్యానికి చేరుకునే సమయాల్లో మాత్రం తేడాలు ఉంటాయి.
రాబోయేది పెద్దది
- రెండోదశలో ప్రాధాన్యంగా తొలుత నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు పూర్తి చేస్తే ఎల్బీనగర్-అమీర్‌పేట-ఎల్బీనగర్ వరకు పెద్ద ఒక వలయ మెట్రో అవుతుంది. మొదటిదానితోపాటు పోలిస్తే ఎక్కువ ప్రయోజనంతో పాటు ఆ పరిధిలోనే 41 స్టేషన్లు ఉండబోతున్నాయి.
- ప్రస్తుతం నాగోల్ నుంచి ఎంజీబీఎస్‌కు మెట్రోలో వెళ్లాలంటే తొలుత నాగోల్ నుంచి పరేడ్‌గ్రౌండ్‌కు వెళ్లి అక్కడి నుంచి ఎంజీబీఎస్‌కు చేరుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో బస్సులో వెళితే సమయానికి గమ్యస్థానం చేరుకోవచ్చు అని ప్రయాణికుల అభిప్రాయం. మెట్రోరైలు రెండో దశలో వలయ మెట్రో మార్గం పూర్తయితే నాగోల్ నుంచి ఎల్బీనగర్ - ఎంజీబీఎస్‌కు చాలా తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికులకు మరింత సౌకర్యాలు మెరుగుకానున్నాయి.