YSRCP Leader Raped in Woman : న్యూడ్ వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో పెడతానంటూ వైఎస్సార్సీపీ నాయకుడు తనను బెదిరించి రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని గుంటూరుకు చెందిన ఓ గృహిణి వాపోయింది. అంతేకాక తన భర్తపై పలుమార్లు హత్యాయత్నం చేయించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు బాధితురాలు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఏఎస్పీ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.
ఇందుకు సంబంధించి బాధితురాలు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ‘గుంటూరులో భార్యాభర్తలం తినుబండారాల తయారీ వ్యాపారం చేస్తున్నాం. వెంగళాయపాలేనికి చెందిన వైఎస్సార్సీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు అలియాస్ ఓంకార్ పలుమార్లు మా దుకాణానికి వచ్చాడు. ఆ తర్వాత షాప్లో దొంగతనం జరిగింది. అది తెలుసుకొని నా భర్తలేని సమయంలో దుకాణం వద్దకు వచ్చి తాను వైఎస్సార్సీపీలో తిరుగుతుంటానని మద్దాలి గిరి, అప్పిరెడ్డి బాగా తెలుసని చెప్పాడు. తన పలుకుబడితో చోరీ చేసినవారిని పట్టుకుంటానంటూ నా సెల్ఫోన్ నంబర్ తీసుకున్నాడు. అలా పరిచయం పెంచుకున్నాడు. ఓ రోజు దుకాణం లోపలకు వచ్చి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పడు నాకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని అడ్డుపెట్టుకొని తరచూ బెదిరించి అత్యాచారం చేశాడు.
రోజూ వాట్సాప్‌కాల్ చేసి నగ్నంగా చూపించమని బెదిరించేవాడు. దొంగలను పట్టుకోవటానికి డబ్బులు ఖర్చవుతాయని చెప్పి రోజూ రూ.4000 చొప్పున బలవంతంగా తీసుకువెళ్లేవాడు. ఇలా రెండు సంవత్సరాలుగా అత్యాచారం చేస్తూ డబ్బులు తీసుకుంటున్నాడు. వ్యాపారం సరిగాలేక అప్పులు పెరిగిపోయాయి. దీంతో అతనికి డబ్బులు ఇవ్వలేనని చెప్పా. డబ్బులివ్వలేదని గత నెల 23న నాపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ గాయాలను చూసి నా భర్త అడిగితే జరిగిన సంగతి చెప్పాను. వెంటనే పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేయించారు. అది మనసులో ఉంచుకొని నన్ను, భర్తను, కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడు’ అని ఆమె వివరించారు.