AP PROPOSALS IN GST COUNCIL MEETING: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. మొత్తం ఎనిమిది అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ ఎదుట ప్రతిపాదనలు చేశారు. పేదలకు ఊరటనిచ్చేలా జీఎస్టీ వెసులుబాటు ఉండాలన్నారు. అదే విధంగా కొన్ని కీలక రంగాలకు ప్రొత్సహం ఇచ్చేలా వివిధ అంశాల్లో జీఎస్టీ వెసులుబాటు కోరుతూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలను పయ్యావుల కమిటీ ముందుంచారు.
జీఎస్టీ నుంచి మినహాయించాలి: ఏపీకి ప్రయోజనం వచ్చేలా కొన్ని అంశాలపై జీఎస్టీ మినహాయింపులను కోరారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏపీలో నిర్వహించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్వాహకులకు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆహ్వానం అందించారు. ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ సేవలపై ఉన్న జీఎస్టీని మినహాయించాలని కోరారు. మద్యం తయారీలో వినియోగించే ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌ను జీఎస్టీ నుంచి మినహాయించి వ్యాట్ పరిధిలోకి తేవాలని కౌన్సిల్‌ని విజ్ఞప్తి చేశారు.
జీవిత, ఆరోగ్య బీమాలపై 15 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలనీ కోరారు. వృద్ధులు, మానసిక వికలాంగులకు జీవిత, ఆరోగ్య బీమాలపై ఉన్న జీఎస్టీ పన్నును మినహాయించాలనీ ప్రతిపాదించారు. ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీలో వెసులుబాటు కల్పిస్తే సామాన్య ప్రజలకు భారం తగ్గుతుందని పయ్యావుల కేశవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలపై ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి కుదించాలని కోరారు.