Growing Demand for Sports Bikes in Hyderabad :హైదరాబాద్ నగరవాసుల అభిరుచి మారుతోంది. గతంలో ఒక కారు ఉంటే సామాజిక హోదా కింద చూసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. కారు కనీస అవసరంగా మారుతోంది. కొందరి ఇళ్లల్లో రెండు, మూడు కార్లు ఉంటున్నాయి. మరోవైపు ఖరీదైన కార్లతోపాటు బైక్‌లను కొనేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం రూ.కోటికి పైన ఖరీదైన కార్లకు రాజధాని నగరంలో బాగా డిమాండ్ పెరిగింది. అదే విధంగా రూ.20 లక్షల ధర దాటిన బైకులను యువత కొనుగోలు చేస్తున్నారు. వాటిపై సుదూర ప్రాంతాలకు రైడింగ్‌లకు వెళ్తున్నారు.
ఆర్టీఏకు ఆదాయం :బైక్ రైడింగ్ చేస్తూ కొత్త కొత్త ప్రదేశాలను చుట్టి రావడం ఒక ట్రెండ్‌గా మారింది. కొందరైతే బైక్‌లపైనే పర్యాటక ప్రాంతాలను చుట్టి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలుగా ఉండే ఖరీదైన బైక్‌లను కొనుగోలు చేస్తున్నారు. రూ.20 లక్షలు ఆపై ధర ఉన్న బైక్‌లకు నగరంలో డిమాండ్ పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 51 హైఎండ్ బైక్‌లు విక్రయించారు. తద్వారా ఆర్టీఏకు రూ.1.73 కోట్ల ఆదాయం సమకూరింది.
ప్రధానంగా హై ఎండ్ కార్లకు ఏయేటికాయేడు డిమాండ్ పెరుగుతుండటం విశేషం. రెండేళ్ల క్రితంతో పోల్చితే నగరంలో ఖరీదైన కార్ల అమ్మకాలు రెండు రెట్లు పెరిగాయి. రెండేళ్ల క్రితంతో పోల్చితే హైదరాబాద్‌లో ఖరీదైన కార్ల అమ్మకాలు రెండు రెట్లు పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే 960 ఖరీదైన కార్లు అమ్ముడయ్యాయి. ముఖ్యంగా ఇందులో రూ.కోటి నుంచి రూ.3 కోట్ల రేటు ఉన్న కార్లకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది.