తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రూప్‌-1 అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌

హైదరాబాద్​లోని అశోక్‌నగర్‌లో గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళన - లాఠీఛార్జ్‌ చేసిన పోలీసులు - పలువురికి గాయాలు

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 23 minutes ago

Group1 Candidates Protest In Hyderabad
Group1 Candidates Protest At Ashok Nagar (ETV Bharat)

Group1 Candidates Protest At Ashok Nagar: గ్రూప్‌-1 పరీక్ష రీ షెడ్యూల్‌ చేయాలని కోరుతూ అశోక్‌నగర్‌లో అభ్యర్థులు మరోసారి ఆందోళనకు దిగారు. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లపైకి చేరుకుని నినాదాలు చేస్తు ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చిన 16 మందిని పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. వందల సంఖ్యలో చేరుకున్న అభ్యర్ధులు గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో అశోక్‌నగర్‌లో పోలీసు పహారా కొనసాగుతోంది.

మరోవైపు ఈనెల 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు మార్గం సుగమం అయింది. గ్రూప్‌-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే ఈనెల 21 గ్రూప్‌-1 పరీక్షలు జరగనున్నాయి.

Bandi Sanjay On Group-1 Exams : జీవో 29 ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. జీవో 29 ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగులపై లాఠీఛార్జ్ చేయడం అమానుషమన్నారు. మరోవైపు బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యర్థులపై లాఠీఛార్జీని ఖండించారు. గ్రూప్ -1 అభ్యర్థులకు తమ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.

జీవో 29ను రద్దు చేయాలని అభ్యర్థుల నిరసన :దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో 29ను రద్దు చేయాలని రాష్ట్రంలోని గ్రూప్‌-1 అభ్యర్థులు కోరుతున్నారు. జనరల్‌ కేటగిరీలోని క్యాండిడేట్స్​ కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్‌రిజర్వుడుగానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్‌ కేటగిరీగానే పరిగణించి 1:50 కింద అభ్యర్థులను మెయిన్స్‌కు పిలవాలని కోరుతున్నారు.

గ్రూప్​-1 మెయిన్స్​కు లైన్​ క్లియర్ - ఆ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

అశోక్ నగర్​లో పరిస్థితి ఆందోళనకరం - మళ్లీ రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు

Last Updated : 23 minutes ago

ABOUT THE AUTHOR

...view details