How to Make Kandi Podi in Telugu: ఇంట్లో వంట చేయడానికి కూరగాయలు లేని సందర్భం చాలా సార్లు వస్తుంది. బయటకు వెళ్లి తీసుకురాలేని సమయాలు కూడా వస్తాయి. ఇలాంటప్పుడు.. ఈ ఒక్కటి ఉంటే చాలు ఏ కూరా అక్కర్లేదు! అదే.. తెలుగువారి ఫేవరెట్ కంది పొడి. ఒక్కసారి తయారు చేసుకొని డబ్బాలో పెట్టుకుంటే ఈజీగా రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది.
ఇంట్లో వంట చేసే ఓపిక లేనప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వేడి వేడి అన్నంలో ఈ కంది పొడి వేసుకొని, అందులో నెయ్యి చుక్క కలుపుకొని తింటే.. ఆహా అద్భుతమే అంటారు. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. కేవలం 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇందులోకి కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- ఒకటింపావు కప్పుల కంది పప్పు
- ఒక కప్పు పచ్చి శనగపప్పు
- ఒక కప్పు పెసరపప్పు
- అర కప్పు మినపప్పు
- 50 గ్రాముల ఎండు మిరపకాయలు
- రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర
- 3 టేబుల్ స్పూన్ల శొంఠి
- రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ కడాయిలో కంది పప్పు వేసి లో-ఫ్లేమ్‌లో వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేర్వేరుగా వేసి వేయించుకోవాలి.
- అనంతరం అదే కడాయిలో ఎండు మిరపకాయలు, జీలకర్ర కూడా వేసి వేర్వేరుగా వేయించుకుని స్టౌ ఆఫ్ చేసి పక్కకుపెట్టుకోవాలి.
- ఇప్పుడు వీటన్నింటిని మిక్సీలో వేసి శొంఠి, ఉప్పు కూడా కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
మరో పద్ధతి..
కావాల్సిన పదార్థాలు
- అర కప్పు కంది పప్పు
- పావు కప్పు పచ్చి శనగపప్పు
- పావు కప్పు పెసరపపప్పు
- ఒక టీ స్పూన్ జీలకర్ర
- 15 ఎండు మిరపకాయలు
- రెండు చిటికెల ఇంగువా
- రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ కడాయిలో కంది పప్పు వేసి లో-ఫ్లేమ్‌లో వేయించుకోవాలి.
- ఆ తర్వాత శనగపప్పు, పెసరపప్పు, ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేర్వేరుగా వేసి వేయించుకోవాలి.
- అనంతరం స్టౌ ఆఫ్ చేసి ఎండు మిరపకాయలు, జీలకర్ర వేసి బాగా కలపాలి. (కడాయి వేడికి జీలకర్ర, ఎండు మిర్చీ సులభంగానే వేగిపోతుంది)
- ఇప్పుడు వేయించుకున్న మిశ్రమం చల్లారక మిక్సీలో వేసి ఇంగువా, ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే టేస్టీ కంది పొడి రెడీ!
సూపర్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ - పుల్లపుల్లని "సేమియా పులిహోర" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!
"చెన్నంగి ఆకు - నువ్వుల పచ్చడి" - ప్రతి ఒక్కరూ తప్పక తినాల్సిన చట్నీ - ఇలా ప్రిపేర్ చేయండి!