How to Make Ulligadda Karam : మనందరం డైలీ ఉల్లిపాయలను వివిధ కర్రీలలో వేసుకొని వండుకుంటుంటాం. నిజానికి కొన్నిరకాల కూరల్లో, సాంబారు వంటి వాటిలో ఉల్లిపాయ వేస్తేనే రుచి. అలాగని ఎప్పుడూ ఇతర పదార్థాలతో వాటిని కలిపి వండితే ఏం మజా ఉంటుంది. అందుకే.. ఈసారి కేవలం ఉల్లిపాయలతోనే ఇలా "ఉల్లి తొక్కు లేదా ఉల్లికారం" ప్రిపేర్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ తొక్కు వేసుకొని తింటుంటే ఆ ఫీలింగ్ వేరే లెవల్లో ఉంటుంది! ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- ఉల్లిగడ్డలు - 2(పెద్ద సైజ్‌వి)
- ఆయిల్ - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- కారం - నాలుగు చెంచాలు
- ఉప్పు - రుచికి సరిపడా
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
- వెల్లుల్లి రెబ్బలు - 10
- కొత్తిమీర - కొద్దిగా
తాలింపు కోసం :
- నూనె - తగినంత
- వెల్లుల్లి రెబ్బలు - 8 నుంచి 10
- కరివేపాకు - 2 రెమ్మలు
- పసుపు - చిటికెడు
తయారీ విధానం :
- ముందుగా ఉల్లిగడ్డలను పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న బౌల్లో చింతపండును నానబెట్టుకోవాలి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక.. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త రంగు మారి, మెత్తబడే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు రోలును శుభ్రంగా కడిగి క్లాత్‌తో తుడిచి.. వేయించుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకొని కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
- ఆవిధంగా రుబ్బుకున్నాక.. అందులో జీలకర్ర, కారం, ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు వేసుకొని అన్నీ కలిసేలా కలియరుబ్బుకోవాలి. అయితే.. ఇక్కడ కారాన్ని మీరు తినే రుచికి అనుగుణంగా వేసుకోవాలి.
- ఆ తర్వాత పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరికాసేపు మిశ్రమాన్ని మెత్తగా దంచుకోవాలి. ఇక చివరగా కొత్తిమీరను వేసుకొని మరోసారి మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- అయితే, దీన్ని నేరుగా తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. లేదంటే.. తాలింపు పెట్టుకొని తినొచ్చు.
- ఇప్పుడు తాలింపు కోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు వేసుకొని పోపును మంచిగా వేయించుకోవాలి.
- పోపు మంచిగా వేగాక.. ముందుగా రుబ్బిపెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని అందులో వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకొని కాసేపు గోలించుకుని దింపుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "ఉల్లిగడ్డ తొక్కు" రెడీ!
- అయితే, రోలు అందుబాటులో లేనివారు మిక్సీలో ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఉల్లిగడ్డ తొక్కును ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ.. రోట్లో రుబ్బుకున్నంత టేస్ట్ రాదు అనే విషయాన్ని గమనించాలి!
ఇవీ చదవండి :
కాకరకాయ తినలేకపోతున్నారా? - ఇలా "కాకర ఉల్లికారం" ప్రిపేర్ చేయండి - ప్లేట్ మొత్తం పక్కా ఖాళీ!
ఇది బ్యాచిలర్స్ స్పెషల్ - కేవలం ఉల్లిపాయలతో సూపర్ కర్రీ! - అన్నం, చపాతీలోకి అదుర్స్!