Fake Currency Notes : చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా? అని అంతర్జాలాల్లో వెతుకుతారు. కష్టపడి పని చేయకుండా, వచ్చిన డబ్బును సేవింగ్స్ చేయకుండా ఉంటే ఇలాంటి సెర్చ్‌లే చేయాల్సి వస్తుంది. మరికొంత మంది తక్కువ సమయంలో పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాలనే ఆశతో పక్కదారి పడుతుంటారు. ఇలాంటివి నిత్యం ఏదో మూల నుంచి వింటూనే ఉంటాం. తాజాగా హైదరాబాద్‌లో ఇలా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాలనే ఆశతో నకిలీ నోట్లు తయారీ చేస్తున్న యువకుడిని రాచకొండ ఎస్‌వోటీ, పహాడీషరీఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి దాదాపు రూ.5 లక్షల విలువ చేసే 1000 రూ.500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా నేరెడ్‌మెట్ రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో శుక్రవారం ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్‌తో కలిసి రాచకొండ సీపీ జి.సుధీర్‌బాబు మీడియాకు వివరాలను వెల్లడించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమరచింతకు చెందిన నవీన్ కుమార్ అనే యువకుడు సివిల్ బ్రాంచ్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. ఆ తర్వాత సరైన ఉద్యోగం దొరక్క మల్టీ మీడియా, గ్రాఫిక్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైన్ వంటి కోర్సులను నేర్చుకున్నాడు. కరోనా సమయంలో కొలువు లేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడ్డాడు.
ఆ తర్వాత డబ్బు సంపాదన కోసం ర్యాపిడో, ఉబర్ వంటి బైక్ ట్యాక్సీలను నడిపాడు. వచ్చే సంపాదన చాలకపోవటంతో 2023 ఆగస్టులో నకిలీ నోట్ల తయారీపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో డిజైనింగ్ సాంకేతిక పరిజ్ఞానంలో పట్టు ఉండటంతో దాన్ని అనువుగా మార్చుకున్నాడు. నకిలీ నోట్ల తయారీ కోసం అంతర్జాలంలో సామగ్రి కోసం వెతికాడు. ఈ క్రమంలో కోల్‌కతాకు చెందిన వ్యాపారితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం నవీన్ కుమార్‌ను కోల్‌కతా రప్పించుకొని శిక్షణ ఇచ్చాడు.