Graduate and Teacher MLC elections Nomination in AP : రాష్ట్రంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవర్గం, అలాగే కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించనున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభం కాగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంకు కార్యకర్తలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.
అనంతరం కలెక్టరేట్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరం నామినేషన్ దాఖలు చేశారు. విజ్ఞులైన పట్టభద్రులు, ఉద్యోగులు తన విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వానికి, పట్టభద్రులకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజశేఖరం హామీ ఇచ్చారు. ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలు తెలిసిన మనిషిగా రాజశేఖర్ కు అందరూ తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే!
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు నామినేషన్ వేశారు. గుంటూరు వెంకటేశ్వర మందిరం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు వచ్చి ఎన్నికల అధికారి ఎస్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలను అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 2007లో మండలి పునః ప్రారంభమైందని అప్పటినుంచి 14 మంది పీడీఎఫ్ తరపున గెలుపొందారని అన్నారు.