Govt Neglect Kondapally Fort in NTR District : అది శత్రుదుర్భేద్యమైన దుర్గం. ఎత్తైన భవనాలు రాతి బురుజులు రాజమహల్‌లు పెద్ద కొలనులు. ఇలా అడుగడుగునా రాజసం ఉట్టిపడేలా అలనాటి చారిత్రక కట్టడాలు, కళాఖండాలు కొండపల్లి ఖిల్లా పేరు చెప్పగానే ఇవే కళ్లముందు కదలాడుతాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కొండపల్లి కోట పాలకుల నిర్లక్ష్యంతో క్రమక్రమంగా ప్రాభవాన్ని కోల్పోతోంది. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో పర్యాటకులు లేక నిర్మానుష్యంగా బోసిపోతోంది.
Ibrahimpatnam NTR District : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో కొండపల్లి ఖిల్లా ఉంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన పురాతన కట్టడాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ పర్యాటకులు తరలివచ్చేవారు. సందర్శకులతో కోటపై జాతరను తలపించేంది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత పురావస్తుశాఖ ఈ ఖిల్లాపై దృష్టి సారించి కనుమరుగైపోతున్న కోటకు జీవం పోసింది. కోట్ల రూపాయలు వెచ్చించి కొండపల్లి చారిత్రక విశేషాలను కళ్లకు కట్టేలా అద్భుతంగా పునరుద్ధరించింది. కోట అణువణువూ సందర్శించేలా రూట్ మ్యాప్‌లు కూడా సిద్ధం చేశారు.
'గండికోట' ఎండిపోయింది- 900 ఏళ్లలో ఇదే తొలిసారి అంటున్న గ్రామస్థులు
కొండపల్లి కోట అంటేనే మూడంతస్తుల రాతి బురుజు బాగా ప్రసిద్ధి. కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం ఉంది. దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, నర్తనశాల, అంగడి, కారాగారం, ఆయుధాగారం, కొలనులు ఉన్నాయి. రాజమహల్ గోడలపై సుందరంగా తీర్చిదిద్దిన కళాఖండాలు ఇలా అనేక నిర్మాణాలు చారిత్రక ప్రాభవాన్ని కళ్లకు కడతాయి. విరూపాక్ష దేవాలయం ఇక్కడి మరో ప్రత్యేకత. అంతేకాదు ప్యాలెస్ సమీపంలో లోతైన జలాశయం కూడా ఉంది. కానీ పాలకుల నిర్లక్ష్యంతో కోట శిథిలావస్థకు చేరింది. ధాన్యాగారం గబ్బిలాలకు నివాసంగా మారింది. నాడు కాంతులీనిన కొండపల్లిలో ఇప్పుడు కనీసం విద్యుత్ దీపాలు కూడా లేవు.