Special Powers To HYDRA : విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ- హైడ్రాకి విస్తృతాధికారాలు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. రాజముద్ర పడటంతో ఇకపై హైడ్రా చేపట్టే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఆ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు హైడ్రాకి ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది.
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ నివృత్తి చేయడంతో జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆటస్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం సహా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు వచ్చినప్పడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపకశాఖ సేవలకు ఎన్ఓసీ జారీ తదితర లక్ష్యాలతో జులై 19న జీవో ఎమ్ఎస్ 99 ద్వారా రాష్ట్రప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది.
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా, ఆర్డినెన్స్‌తో మరిన్ని కీలక అధికారాలు హైడ్రాకు దాఖలుపడ్డాయి. ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇటీవలే పలువురు ఉన్నతాధికారులు, సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది.
ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులివ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జీహెచ్‌ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 374బీ ని ఆర్డినెన్స్‌లో చేర్చారు. అనధికారిక ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం హైడ్రాకు బదిలీ అయింది. పురపాలక చట్టం-2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్‌కి ఉన్న అధికారాలు, బీపాస్ చట్టం-2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్‌ఫోర్స్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు ఉన్న అధికారాలను హైడ్రాకు ఇచ్చారు.