YSRCP Supplying Deadly J Brand: ‘జే బ్రాండ్ల’ మద్యం విక్రయాల ద్వారా ప్రజల్ని పీల్చిపిప్పి చేసేసిన జగన్‌మోహన్‌రెడ్డి అందులో సరికొత్త దోపిడీ పర్వానికి తెరలేపి తన సొంత బొక్కసాన్ని నింపుకున్నారు. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలు వంటివన్నీ గుత్తాధిపత్యంలో ఉంచుకుని పెద్ద ఎత్తున దోచుకున్నారు. తన ప్రధాన కోటరీతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, వారి సన్నిహితులు, వైఎస్సార్సీపీకి కరుడుగట్టిన మద్దతుదారులైన అధికారులను ముందుంచి ఈ మొత్తం దందా నడిపించారు. మద్యం దుకాణాలన్నిటినీ ప్రభుత్వమే నిర్వహించేలా నూతన విధానం తీసుకొచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రభుత్వ పెద్దల సన్నిహితులు, అధికార పార్టీ కీలక నేతల్లో కొందరు వారి బినామీల పేరిట మద్యం సరఫరా కంపెనీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీలను సామ దాన బేధ దండోపాయాలు ప్రయోగించి చేజిక్కించుకున్నారు. అక్కడ ‘జే బ్రాండ్లు’ తయారు చేశారు.
Government Supplying Adulterated Liquor to the People: వీటితో పాటు నిర్దేశించిన కమీషన్ చెల్లించేందుకు అంగీకరించిన కంపెనీలకు మాత్రమే సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. ఇవి తప్ప గతంలో ప్రాచుర్యం పొందిన బ్రాండ్లేవీ ప్రభుత్వ దుకాణాల్లో దొరక్కుండా చేశారు. వినియోగదారులు కోరుకునేవి కాకుండ, ప్రభుత్వం అమ్మేవి మాత్రమే కొనుక్కోవాల్సిన పరిస్థితి కల్పించారు. అక్కడ కూడా డిజిటల్ చెల్లింపులకు ఆస్కారం లేకుండా కేవలం నగదు లావాదేవీలనే నిర్వహించారు. ఇలా ఆది నుంచి అంతం వరకూ మొత్తం మద్యం వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనీవినీ ఎరగని రీతిలో దోచుకున్నారు. దీనికోసం జగన్ అండ్ కో అవలంబించిన మోడెస్ అపరెండీ (నేర పద్ధతి)ని పరిశీలిస్తే ఎవ్వరైనా నివ్వెరపోవాల్సిందే మరోవైపు 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానంగా పేర్కొన్న ‘దశలవారీ మద్య నిషేధం’ హామీకి మంగళం పాడేశారు. 2024 ఎన్నికల నాటికి మద్యాన్ని అయిదు నక్షత్రాల హోటళ్లకు పరిమితం చేశాకే ఓట్లు అడుగుతానన్న ఆయన ఇప్పుడు ఊరూరా తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? ఆ నైతిక హక్కు, అర్హత ఎక్కడిది? దీన్ని బట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నిబద్ధత, నైతికత జగన్‌కు లేనేలేదని తేటతెల్లమైపోయింది.
జగనన్న మద్యం దుకాణాలు - ఉమ్మడి అనంతలో 33వేల మంది ఆస్పత్రి పాలు - ap liquor brands
కమీషన్ల రూపంలో రూ.కోట్లు దోచారు: జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి గత ఐదేళ్లలో 14.41 కోట్ల కేసుల మద్యం (ఐఎంఎల్), 5.85 కోట్ల కేసుల బీర్లు విక్రయించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ (ఏపీఎస్‌బీసీఎల్) వివిధ కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసి వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించింది. ఒక్కో కేసు మద్యానికి (ఐఎంఎల్) రూ.250 చొప్పున, ఒక్కో కేసు బీరుకు రూ.150 చొప్పున ప్రభుత్వ పెద్దలకు కమీషన్‌గా చెల్లించేందుకు అంగీకరించిన కంపెనీలకు మాత్రమే ఏపీఎస్‌బీసీఎల్ సరఫరా ఆర్డర్లు ఇచ్చారని, ఈ లెక్కన ఐదేళ్లలో మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినందుకు రూ.3,170.20 కోట్లు, బీరు ఆర్డర్లకు రూ.877 కోట్లు మొత్తం రూ.4,047.70 కోట్లు వరకూ కమీషన్ల రూపంలో ‘ప్రభుత్వ పెద్ద’కు చేరాయనే ఫిర్యాదులున్నాయి.
జగన్ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో ఒకటైన అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి బినామీ సంస్థ అనే ఫిర్యాదులున్నాయి. దీనికి సొంతంగా ఒక్క డిస్టిలరీ యూనిట్ కూడా లేదు. విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఏస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లను సబ్ లీజు పేరిట ఆధీనంలోకి తీసుకుని ‘జే బ్రాండ్‌ను ఉత్పత్తి చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తెచ్చిన రెండు నెలల తర్వాత 2019 డిసెంబరు 2న ‘అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ హైదరాబాద్‌లో పురుడు పోసుకుంది. కాశీచయనుల శ్రీనివాస్, ముప్పిడి అనిరుధ్‌రెడ్డి డైరెక్టర్లుగా ఇది ఏర్పాటైంది.
కాశీచయనుల శ్రీనివాస్ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా కొనసాగిన శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కొన్నాళ్ల పాటు డైరెక్టర్‌గా కొనసాగారు. ముప్పిడి అనిరుధ్‌రెడ్డి కొన్నాళ్ల క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేసిన, సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తోడల్లుడు. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి? దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్‌ల మద్యం అమ్మాలి? అన్నది రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకే జరిగింది. కేవలం 25నెలల వ్యవధిలో ఏకంగా రూ.1,164.86 కోట్ల విలువైన మద్యం సరఫరాకు ఈ కంపెనీకి ఆర్డర్లు ఇచ్చారు. గత నాలుగున్నరేళ్లలో ఈ కంపెనీకి లభించిన సరఫరా ఆర్డర్లు లెక్కిస్తే ఆ విలువ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కంపెనీ సరఫరా చేసిన అదాన్స్ సుప్రీం బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ, 9 సీ హార్సెస్ విస్కీ, ఏసీ బ్లాక్ రిజర్వు విస్కీ వంటివి ప్రభుత్వ దుకాణాల్లో ఎక్కువగా అమ్మారు.
నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీస్‌ను వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారనే ఫిర్యాదులున్నాయి. ఈ కంపెనీకి 2019 అక్టోబరు 2 నుంచి 2021 నవంబరు మధ్య ఏకంగా రూ.1,863.12 కోట్ల విలువైన 1.16 కోట్ల కేసుల మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. ఈ కంపెనీ నుంచి వచ్చిన దారుహౌస్ ఎక్స్‌వో బ్రాందీతో పాటు ఇతర బ్రాండ్లను ప్రభుత్వ దుకాణాల్లో ఎక్కువగా అమ్మారు. వీటితో పాటు ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, శర్వానీ ఆల్కో బ్రూవరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌ఎన్‌జే సుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తదితర కంపెనీలకు ఎక్కువ ఆర్డర్లు లభించాయి.
ఏపీలో మద్యపానం ప్రాణాంతకం - జే బ్రాండ్ మద్యంతో పేదిళ్లలో చావుడప్పు
కొత్త ప్రాంతాల్లోకి విస్తరణ: దశలవారీ మద్య నిషేధం అంటే దాని లభ్యతను తగ్గించాలి. కానీ జగన్ మాత్రం గతంలో బార్‌లు లేని ప్రాంతాల్లోనూ అవి ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించారు. కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోనూ వాటిని ఏర్పాటు చేయించారు. గతంలో నగర సరిహద్దుల నుంచి 5 కిలోమీటర్ల వరకూ, పట్టణ సరిహద్దుల నుంచి 2 కిలోమీటర్ల వరకూ మాత్రమే బార్‌లు పెట్టే వీలుండేది. నగరపాలక సంస్థల సరిహద్దుల నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకూ, పురపాలక సంఘాల సరిహద్దుల నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకూ బార్లు పెట్టుకునే అవకాశమిచ్చారు. దీంతో నగరాలు, పట్టణాలకు దూరంగా ఉన్న కొత్త ప్రాంతాల్లోనూ బార్లు వచ్చాయి. మద్యం లభ్యత విపరీతంగా పెరిగింది. పర్యాటక ప్రాంతాల్లో బార్‌ల ఏర్పాటుకు లైసెన్సులు ఇచ్చారు.
ఒక్క హామీ వంద తూట్లు: మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందేమోకానీ దానివల్ల ప్రజలు ఎన్నోరెట్లు నష్టపోతున్నారు. అందుకే రేపటి మన ప్రజాప్రభుత్వం మద్యాన్ని నిషేధిస్తుంది అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే ఆ హామీని సమాధి చేశారు. అంతేనా మరింత తాగేలా ప్రోత్సహించి డబ్బు కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడ్డారు.
ఏకంగా తాకట్టు పెట్టారు: రాబోయే కొన్నేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ (ఏపీఎస్‌బీసీఎల్) ద్వారా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. ప్రజలతో మరింత తాగించి, తద్వారా ఆదాయం సమకూర్చుకొని అప్పులు తీర్చటమే తమ ప్రభుత్వ విధానమని తేల్చేశారు. మద్యం వ్యాపారాన్ని విపరీతంగా విస్తరించారు. కొందరు వ్యసనపరులు ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టేసి మరీ మద్యం కొంటారు. అలాంటి తాగుబోతుల్నే తాకట్టు పెట్టేసి వారిపై అప్పులు తెచ్చిన ఘనత మాత్రం జగన్‌కే దక్కింది.