Special Training to Juvenile offenders on Ganja : గంజాయి మహమ్మారి ముక్కుపచ్చలారని బాలల జీవితాలను సర్వనాశనం చేస్తొంది. వారిని జీవచ్ఛవాలుగా మారుస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన తప్పు ఈ తరానికి పెద్దగా ముప్పుగా పరిణమిస్తోంది. విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు, చివరికి పాఠశాలల విద్యార్థులు కూడా గంజాయి వ్యసనానికి బానిసలుగా మారడం తీవ్రంగా కలవరపరుస్తోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో వందలాది మంది బాలలు నేర ఘటనల్లో పాల్గొని నేరస్థులుగా మారారని, ఇది సమాజాన్ని తీవ్రంగా ఆందోళన పరిచే అంశమని పోలీసులు పేర్కొంటున్నారు.
నేర స్వభావాన్ని తొలగించి విద్యాబుద్ధులు నేర్పించి : బాల నేరస్థుల్లో పరివర్తన తేవడానికి విశాఖపట్నంలోని ముడసర్లోవ రోడ్ దీనదయాళ్‌పురంలో ప్రభుత్వ బాలుర ప్రత్యేక గృహం ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన బాల నేరస్థులను ఈ గృహంలో ఉంచుతున్నారు. వీరిలో గంజాయి రవాణా కేసుల్లో పట్టుబడిన వారు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇక్కడి బాలురలో నేర స్వభావ లక్షణాలను తొలగించి విద్యాబుద్ధులు నేర్పించేందుకు గృహం నిర్వాహకులు కృషి చేస్తున్నారు. బాల నేరస్థులు పూర్తి స్థాయిలో పరివర్తన చెంది ఇక్కడి నుంచి బయటకు వెళ్లేలా చూస్తున్నారు.
గంజాయి స్మగ్లర్లు 'పుష్ప' సీన్ ప్లాన్ చేశారు - రియల్ పోలీసులు ఛేజ్ చేశారు - అదిరిపోయే ట్విస్ట్
1. ఉదాహరణకు..రమేష్ (పేరు మార్చాం) 9వ తరగతి చదివే సమయంలో చదువులో వెనుకబడ్డాడు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమం కారణంగా సైన్సు, గణితం ఆ విద్యార్థికి అర్థం కాలేదు. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించలేనని తీవ్ర ఆందోళన చెందాడు. దీంతో పాఠశాలకు వెళ్లకుండా బయట తిరగడంతో వ్యసనపరులు స్నేహితులయ్యారు. వారితో కలిసి గంజాయి తాగడం అలవాటైంది. దాని కోసం డబ్బులు అవసరం కావడంతో దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. చివరికి పోలీసులకు చిక్కి బాల నేరస్థుడిగా మారాడు.