Police Collecting Evidence Against Vallabhaneni Vamsi: అపహరణ, దాడి కేసులో వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరిస్తున్నారు. సాంకేతిక ఆధారాలన్నీ పక్కాగా తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రాయదుర్గంలో వంశీ నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ వద్ద సీసీ కెమెరాల్లో ఫుటేజీని తీసుకున్నారు. ఇందులో పలు కీలక ఆధారాలు లభించాయి. సత్యవర్ధన్‌ను విశాఖకు తీసుకెళ్లి తొలుత చేబ్రోలు శ్రీనుకు చెందిన ఫ్లాట్‌లో ఉంచారు. అనంతరం హోటల్‌కు తరలించారు. ఈ రెండుచోట్లా సీసీ కెమెరాల్లో వంశీ అనుచరులు సత్యవర్ధన్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. వీటిని విజయవాడ నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది.
ఈ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు వంశీని 10 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి ఇంకా చాలా విషయాలు వెలికితీయాల్సి ఉందని, చాలా మంది నిందితులు దొరకలేదని ఆ పిటిషన్‌లో వివరించారు. పిటిషన్‌లో సాంకేతిక దోషాలున్నాయని న్యాయాధికారి చెప్పడంతో వెనక్కి తీసుకుని, సరిదిద్ది మళ్లీ దాఖలు చేశారు. అనంతరం ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేయాలని న్యాయాధికారి ఆదేశించారు. కేసు నాలుగో ఏసీజేఎం కోర్టు నుంచి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు సోమవారం బదిలీ అయింది.
కిడ్నాప్ చేస్తూ సీసీ కెమెరాలు మరిచారు - మరోసారి అడ్డంగా దొరికిపోయిన వంశీ గ్యాంగ్
ఇంటి భోజనం, బెడ్ కావాలి: వంశీ తరఫు న్యాయవాదులు సోమవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఎవరినీ బెదిరించాల్సిన అవసరం లేదని రాజకీయ, వ్యక్తిగత కక్షతో ప్రభుత్వం కేసు పెట్టి, అరెస్టు చేసిందని పిటిషన్‌లో వంశీ పేర్కొన్నారు. అనారోగ్య కారణాల దృష్ట్యా కారాగారంలోని ఆహారం బదులుగా ఇంటి భోజనం అనుమతించాలని, వెన్నునొప్పి కారణంగా బెడ్ సౌకర్యం కల్పించాలని వంశీ మరో పిటిషన్ వేశారు. ఇది ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు బాధితుడు సత్యవర్ధన్ స్టేట్‌మెంట్‌ను పటమట పోలీసులు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయాధికారి అప్పారావు ఎదుట నమోదు చేయించారు. కోర్టు హాలు నుంచి అందరినీ బయటకు పంపి, సత్యవర్ధన్‌తో మాట్లాడి నమోదు చేసుకున్నారు. పోలీసులు ఆయన్ను మీడియా కంటపడకుండా కోర్టుకు తీసుకొచ్చి, అంతే గోప్యంగా తిరిగి పంపించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ములాఖత్‌లో వంశీని కలిసేందుకు ఇవాళ ఉదయం జిల్లా జైలుకు రానున్నారు.
అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా వంశీ - అక్రమాల్లో 'సిక్స'ర్ గ్యాంగ్ తోడు
వంశీ కొల్లగొట్టింది రూ.195 కోట్లు - ప్రభుత్వానికి అందిన నివేదిక