Govt Focused on Tirupati TDR Bond Irregularities:అభివృద్ధి పేరుతో తిరుపతి నగరపాలక సంస్థలో గడిచిన మూడు ఏళ్ల కాలంలో చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం తీవ్ర అక్రమాలకు నిలయమైంది. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాల పేరుతో సేకరించిన భూములకు టీడీఆర్ బాండ్ల రూపంలో చెల్లించిన పరిహారంలో వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతల జేబులు నింపాయన్న విమర్శల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. 37 కోట్ల నిధులతో చేపట్టిన 12 రహదారుల సంఖ్యను ఏకంగా 42 కోట్లకు పెంచిన గత పాలకులు భూ సేకరణలో పలు అక్రమాలకు పాల్పడ్డారు.
పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనలు గాలికొదిలేసిన వైసీపీ నేతలు ప్రైవేటు వ్యక్తుల భూముల్లో నిర్మాణాలు ప్రారంభించారు. సమగ్ర సర్వే, భూ యజమానులకు తాఖీదులు, పరిహారం, టెండర్లు వంటి వేవీ లేకుండానే రహదారుల నిర్మాణం చేపట్టారు. అడ్డగోలుగా సాగుతున్న మాస్టర్ ప్లాన్ రహదారులపై బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకొన్నా లెక్కచేయకుండా నిర్మాణాలు కొనసాగించారు.
అధికార పార్టీ నేతలతో పొలిటికల్ కమిటీ:టీడీఆర్ బాండ్ల ముసుగులో అక్రమాలకు తెరతీసిన గత పాలకులు తమకు వంతపాడే అధికారులను పట్టణ ప్రణాళిక విభాగంలో ఖాళీ అయిన కీలక పోస్టుల్లో నియమించుకొన్నారు. స్థాయి లేకున్నా పదిమంది నాలుగో తరగతి ఉద్యోగులను ప్రణాళికాధికారులుగా నియమించారు. గెజిటెడ్ హోదా కలిగిన ప్రణాళికాధికారుల విధులతో పాటు పూర్తి అధికారాలు కట్టబెట్టారు. నగరపాలక వ్యవస్థకు సమాంతరంగా ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలతో కూడిన మాస్టర్ ప్లాన్ రోడ్ల పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేశారు. అనధికారికంగా ఏర్పాటైన ఈ కమిటీ కనుసన్నల్లో రోడ్ల నిర్మాణం, టీడీఆర్ బాండ్ల జారీ వాటి విక్రయాలు సాగాయి. పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల రీతిలో పొలిటికల్ కమిటీ గుత్తేదారులతో కలిసి వెళ్లి అర్ధరాత్రిళ్లు రోడ్డు విస్తరణకు భవనాలు కూల్చడం, ఎదురు తిరిగితే బెదిరించడం, మధ్యవర్తులుగా వ్యవహరించి భూములు, భవనాలు స్వాధీనం చేసుకొన్నారన్న విమర్శలు ఉన్నాయి.