Government Focus on Roads Repair in Vijayawada :రహదారుల మరమ్మతులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లలో గాలికి వదిలేసిన రోడ్లను బాగుచేయడంపై దృష్టి సారించింది. రాష్ట్ర రహదారులు, గ్రామీణ రోడ్లతో పాటు నగరాల్లోని అంతర్గత రోడ్లకూ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. విజయవాడలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అడుగు బయటపెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు తెచ్చారు. బయటకు వెళ్లిన మనిషి క్షేమంగా ఇంటికి తిరిగొస్తాడన్న నమ్మకం లేకుండా చేశారు. దెబ్బతిన్న రహదారులతో నిత్యం రోడ్డు ప్రమాదాలతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. గుంతలు తేలిన రోడ్లతో వాహనదారులు నరకం చూశారు. ఐదేళ్లపాటు కనీస మరమ్మతులకు నోచుకోక భారీ గుంతలు ఏర్పడ్డాయి.
Pothole Free Roads in Andhra Pradesh :నిత్యం రద్దీగా ఉండే విజయవాడ నగరంలోని అంతర్గత రోడ్లనూ బాగు చేయలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రహదారుల మరమ్మతులపై ప్రత్యేక దృష్టిసారించింది. నగర, పురపాలికల్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టింది. విజయవాడలోని మూడు సర్కిళ్లలో 14వందల 86 గుంతలను గుర్తించి, వీటిలో 478 పూడ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ముఖ్య రహదారులకూ మరమ్మతుల చేపట్టారు. కొత్త రోడ్లు నిర్మించకున్నా కనీసం ఉన్నవాటిల్లో గుంతలు పూడ్చడం పట్ల వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.