తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దపల్లి జిల్లాలో గూడ్స్‌ రైలు బోల్తా - తప్పిన పెను ప్రమాదం - 39 రైళ్లు రద్దు - GOODS TRAIN DERAILED IN PEDDAPALLI

పెద్దపల్లి- రామగుండం స్టేషన్ల మధ్య గూడ్స్‌ రైలు బోల్తా - దిల్లీ, చెన్నై మార్గంలో రాకపోకలకు అంతరాయం - పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ

GOODS TRAIN DERAILED IN TELANGANA
GOODS TRAIN DERAILED (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2024, 6:12 AM IST

Updated : Nov 13, 2024, 11:49 AM IST

Goods Train Derailed in Peddapalli Today :ఐరన్​ రోల్స్​తో వెళుతున్న గూడ్స్​ రైలు పట్టాలు తప్పిన ఘటన పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేటుకు కొద్ది దూరంలో​ జరిగింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. ఈ గూడ్స్​ రైలు కర్ణాటకలోని బళ్లారి నుంచి యూపీలోని గజియాబాద్​కు వెళుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే కరీంనగర్​, పెద్దపల్లి రైల్వే స్టేషన్లు దాటి తర్వాత రాఘవాపూర్​ వద్ద జరిగింది. భారీ శబ్దంతో పట్టాలు తప్పడంతో సమీప గ్రామాలకు చెందిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్లను ఆయా స్టేషన్ల వద్ద నిలిపివేశారు.

39 రైళ్లు పూర్తిగా రద్దు.. 7 పాక్షికంగా రద్దు : రైళ్లు మూడు రైల్వే ట్రాక్​లపై పడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆయా రూట్లలో వెళ్లాల్సిన 39 రైళ్లును పూర్తిగా రద్దు చేయగా, 7 పాక్షికంగా రద్దు చేశారు. 53 రైళ్లను దారి మళ్లించారు. 7 రైళ్లను రీషెడ్యూల్​ చేశారు. నర్సాపూర్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - నాగ్​పూర్, హైదారాబాద్ - సిర్​పూర్ కాగజ్​నగర్, సికింద్రాబాద్ - సిర్​పూర్ కాగజ్​నగర్, కాజీపేట - సిర్​పూర్ టౌన్, సిర్​పూర్ టౌన్ - కరీంనగర్, కరీంనగర్ -బోధన్, సిర్​పూర్ టౌన్ - భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్ - బల్లర్షా, బల్లార్ష - కాజీపేట, యస్వంత్ పూర్ - ముజఫర్ పూర్, కాచిగూడ - నాగర్ సోల్, కాచిగూడ - కరీంనగర్, సికింద్రాబాద్ - రామేశ్వరం, సికింద్రాబాద్ - తిరుపతి, అదిలాబాద్ - పర్లి, అకొలా - పూర్ణ, అదిలాబాద్ - నాందేడ్, నిజామాబాద్ - కాచిగూడ, రాయచూర్ - కాచిగూడ, గుంతకల్ - బోధన్ రైళ్లను రద్దు చేశారు.

రైళ్లను నిలిపివేయడంతో తప్పిన పెను ప్రమాదం :44 బోగీలతో వెళ్తున్న ఈ గూడ్స్ ఓవర్‌ లోడ్‌తోనే పట్టాలు తప్పి 11 బోగీలు బోల్తా పడ్డాయని అధికారులు భావిస్తున్నారు. రైలు బోగీల మధ్య ఉన్న లింకులు తెగిపోవడంతో పాటు ఒకదానిపై మరొకటి పడి అక్కడి ప్రదేశం దెబ్బతింది. ఈ ప్రమాదంతో ఈ మార్గంలో ఉన్న మూడు ట్రాక్​లు దెబ్బతిన్నాయి. కాజీపేట-బల్లార్షా మార్గంలో పలు రైళ్లను నిలిపివేయడంతోపాటు మంగళవారం రాత్రి వేళ నడిచే రైళ్లను అధికారులు ఆయా స్టేషన్లలో నిలిపేలా చర్యలు తీసుకున్నారు. చెన్నై-దిల్లీ, సికిందరాబాద్‌- దిల్లీ మార్గంలో రైళ్లుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రైళ్ల రద్దు లిస్ట్​ను విడుదల చేసిన రైల్వే శాఖ ​ (ETV Bharat)
39 రైళ్లు రద్దు లిస్ట్​ (ETV Bharat)

ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా : ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పెద్దపల్లి స్టేషన్‌లో సంపర్క్ క్రాంతి, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లను సైతం నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే అధికారులు బుధవారం తెల్లవారుజాము వరకు పట్టాలను బాగు చేసే దిశగా సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఈ ఘటన గురించి తెలియగానే నాగపూర్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ రైల్వే అధికారులకు ఫోన్‌ చేసి ఆరా తీశారు.

పట్టాలు దెబ్బతినడంతో 3 రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడిందని అధికారులు పేర్కొనగా తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని బండి సంజయ్​ ఆదేశాలు జారీ చేశారు. ఈ మార్గంలోని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. బుధవారం ఉదయం వరకు పునరుద్ధరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు కేంద్ర సహాయ మంత్రి సంజయ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

సికింద్రాబాద్‌ - శాలీమార్‌ ఎక్స్‌ప్రెస్​కు ప్రమాదం - పట్టాలు తప్పిన 3 బోగీలు

Last Updated : Nov 13, 2024, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details