Godavari Floods in AP 2024 :వరదలతో గోదావరి తీర ప్రజలు సతమతమవుతున్నారు. తగ్గినట్టే తగ్గిన వరద మళ్లీ ప్రమాదకరంగా మారింది. కోనసీమలోని లంకలు, లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గౌతమి గోదావరి తీరంలోని ఊబలంక, కొమరాజు లంక, మందపల్లి, కేదార్లంక, నారాయలంక, బడుగువానిలంక, మూలస్థానం, అంకంపాలెం ప్రాంతాలను వరద చుట్టుముట్టేసింది. అరటి, కూరగాయల తోటలు మునిగిపోయాయి.
"వరదల వల్ల పంటలన్ని మునిగిపోయాయి. మాకు చాలా నష్టం వచ్చింది. గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా ఇలానే జరిగింది. అరటి, కూరగాయలు పూర్తిగా రంగు మారిపోయాయి. పంటను మార్కెట్కు తీసుకువెళ్తే ధర వస్తుందో రాదో తెలియని పరిస్థితి. మా కష్టమంతా గోదారి పాలైంది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాం." -రైతులు
Flood Effect in Andhra Pradesh : అయినవిల్లి మండలం వెదురుబీడెం కాజ్‌వేపై వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక నీటిలోనే మగ్గుతున్నాయి. నివాస గృహాలకు వరద చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సత్యనారాయణ పర్యటించారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ముమ్మిడివరం మండలం గురజాపులంక, లంక ఆఫ్ ఠాణేలంక, కూనలంక పూర్తిగా నీటమునిగాయి. పి.గన్నవరం మండలం శివాయిలంక, నాగులంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
"మాకురోడ్లు లేవు. వరదలు వచ్చిన ప్రతిసారి మాకు ఇదే పరిస్థితి ఎదురవుతోెంది. వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాం. పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నాం. అధికారులు సక్రమంగా తాగునీరు సరఫరా చేయట్లేదు. వరద నీటిలోనే వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నాం. అధికారులు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం." - లంక గ్రామాల ప్రజలు