CRDA Authority Meeting: అమరావతి రాజధాని ప్రాంతంలో 11 వేల 467 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని సీఎం నివాసంలో 41వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం జరిగింది. 23 అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. రాజధానిలో కీలకమైన భవనాలు, రహదారులు, వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు.
రూ.2,498 కోట్లతో రహదారుల పనులు: సమావేశం అనంతరం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నామని అన్నారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు, 2 వేల 498 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లకు పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపామన్నారు.
రూ.1508 కోట్లతో మూడు రిజర్వాయర్ల నిర్మాణం: వరద నివారణకు 1,585 కోట్ల రూపాయలతో పాల వాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్‌తో పాటు రిజర్వాయర్లు నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, క్లాస్ -4, అల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాలు పనులను 3 వేల 523 కోట్ల రూపాయలతో చేపట్టబోతున్నామని అన్నారు. రైతులకు ఇచ్చిన రిటర్ణబుల్ లే అవుట్లలో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు 3 వేల 859 కోట్ల రూపాయలతో సమావేశంలో అనుమతి పొందామన్నారు.
ఈనెల 15లోపు ఐదు ఐకానిక్ టవర్ల డిజైన్లు: ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని అన్నారు. భూగర్భ డ్రైనేజీ, వీధి దీపాలు, తాగు నీరు తదితర మౌలిక వసతులను అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు డిజైన్లకు టెండర్లు పిలిచామన్నారు. ఐదు ఐకానిక్ టవర్లకు ఈనెల 15లోపు డిజైన్లు వస్తాయని తెలిపారు. ఈ నెలాఖరుకు ఐకానిక్ భవనాలకు టెండర్లు పిలుస్తామన్నారు.