AP Cabinet Sub Committee Meeting on PDS Rice Smuggling: పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలని భావిస్తోంది. సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్‌లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, శాంతిభద్రతల ఐజీ, పౌర సరఫరాల శాఖ అధికారులు, మారిటైమ్ బోర్డు సీఈఓ, కస్టమ్స్, కాకినాడ పోర్టు అధికారులు హాజరయ్యారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో వ్యవహారాలపై చర్చించారు. కాకినాడ పోర్టులో భద్రత వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇందులో భాగంగా కాకినాడ పోర్టు భద్రత కోసం ఛీఫ్ సెక్యురిటీ ఆఫీసర్‌ను నియమించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తున్నందున పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాకినాడ పోర్టు, పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై నిఘాను కట్టుదిట్టం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
కాకినాడ పోర్టులోని 5 వేర్ హౌసుల్లో సార్టెక్స్ మిషన్లు ఉన్న అంశంపైనా మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈ గోదాముల్లో సార్టెక్స్ యంత్రాలు ఏ విధంగా ఏర్పాటు చేశారని మారిటైమ్ బోర్డు, కాకినాడ పోర్టు అధికారులను మంత్రులు ప్రశ్నించారు. సార్టెక్స్ యంత్రాలను ఏర్పాటుపై విచారణ చేపట్టాలని, అందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని ఫోన్ - బాంకు ఖాతా నుంచి రూ.40 లక్షలు మాయం
'కఠిన నిర్ణయాలు తీసుకోవాలి' - సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్